Summer | హైదరాబాద్ : రాష్ట్రంలో భానుడి ప్రతాపం మొదలైంది. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలను దాటుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాబోయే 3 రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఉంటుందని వాతావరణ విభాగం పేర్కొంది.
మంగళవారం రాష్ట్రంలో సరాసరి కనిష్ఠంగా 18 డిగ్రీలు, గరిష్ఠంగా 37 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్ జిల్లాలో 37డిగ్రీలు, ఖమ్మంలో 37, వరంగల్ 36, హైదరాబాద్ 34.2, మహబూబ్‌నగర్ 36.1, మెదక్‌లో 35.4, నల్లగొండలో 33, నిజామాబాద్‌లో 36 డిగ్రీలు, కరీంనగర్లో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వేడిగాలులు వీస్తున్నాయని,ఆ ప్రభావం వల్లే ఎండ తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
మరోవైపు పెరుగుతున్న ఎండ తీవ్రతకు తగ్గట్లుగా మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాత్రి చలి, మధ్యాహ్నం ఎండతో చాలా మంది జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే చిన్న పిల్లలు, వృద్ధులు బయటి ఆహారం జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం పెంచే తాజా పండ్లను అధికంగా తీసుకోవాలని సూచించారు. చిన్న పిల్లలకు పానీపూరి, నూనెతో చేసిన వేపుళ్లు, హోటల్ ఫుడ్‌కు దూరంగా ఉంచాలని సూచించారు. మెదడు చురుగ్గా ఉండేలా డ్రై ఫూట్లు అధికంగా ఇవ్వాలని చెప్పారు. మజ్జిగ, కొబ్బరి నీరు, రాగి జావ తాగిస్తే మంచిదన్నారు. మాంసాహారానికి బదులుగా శాఖాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నాం : కేటీఆర్
KTR | సమగ్ర కుటుంబ సర్వే మాయం.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్