సాధనానందుడుగా మారిన ప్రణాలుడు మాధవుని ఆదేశం మేరకు గ్రామీణులను చైతన్య పరచడానికి బయలుదేరినాడు. కల్లణసీహుడు తన మహేంద్రజాలంతో ప్రేక్షకులకు పుష్పక విమానంలో లంక చేరుకున్న అనుభూతిని కలిగించినాడు. ఆ తర్వాత..
చిలుకవాడలోని ఒక పొలంలో గల పాకలోని రహస్య భూగృహంలోకి వెళ్లకుండా ఆగిపోయినాడు పోటిసుడు. లోపలికి వెళ్లిన వామదేవుడు మళ్లీ ప్రవేశద్వారం దాకా వచ్చి పోటిసుణ్ని లోపలికి రమ్మన్నాడు. “దొరవారూ! నాకు అంతా ఆయోమయంగా ఉన్నది. ఇక్కడ ఇంకెవరైనా శత్రువులు ఉన్నారేమో కనిపెడతాను..” అంటూ ఇంకేదో చెప్పబోయినాడు పోటిసుడు. “మిత్రమా! ఇది సవరసత్తిగారి గ్రామం. ఇక్కడ విషయాలన్నీ వారు చూసుకుంటారు. మనం చాలాసంగతులు మాట్లాడుకోవాల్సి ఉన్నది. నువ్వు తొందరగా లోపలికి రా!” అన్నాడు తొందరపెడుతూ వామదేవుడు.
సవరసత్తి పేరు వినగానే మరోమాట మాట్లాడకుండా వామదేవుని ఆజ్ఞను పాటించినాడు పోటిసుడు. ఈ ప్రాంతానికి ఆమె మహారాణి వంటిదని ఎన్నో ఏండ్లుగా వింటున్నాడు అతను. అక్కడ ఆమెకు ఎదురు లేదు. ఆమె మాటకు తిరుగులేదు. కళింగ రాజ్యంలో ప్రవేశించిన నాటి నుంచి జరిగిన సంఘటనలన్నీ వివరించినాడు వామదేవుడు. పనిలో పనిగా సౌగంధికను కూడా పరిచయం చేసినాడు. “వందనాలు అందగాడా!” అన్నది అందంగా నవ్వుతూ సౌగంధిక. అంతేకాదు.. “మీ దేశంలో అందరూ అందగాళ్లేనా?” అన్నది వామదేవునితో, పోటిసుణ్ని ఎగాదిగా చూస్తూ. తలవంచుకుని నిలబడ్డాడు పోటిసుడు. అతని కళ్లనుంచి అప్రయత్నంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. “నేనేమైనా తప్పుగా మాట్లాడినానా?” కంగారుపడుతూ అన్నది సౌగంధిక. “అటువంటిదేమీ లేదమ్మా! మీరు నా తల్లివంటి వారు. నన్ను ఏమైనా అనవచ్చు..” అన్నాడు పోటిసుడు. “మరి నీ దుఃఖానికి కారణం..?” అడిగింది ఆమె. ఒక్కక్షణం తర్వాత, గూడెం ఆడపిల్లలను ఎత్తుకొని పోతున్న సంఘటన మొదలు చిలుకవాడలో కాలు పెట్టిన దాకా జరిగిన కథంతా క్లుప్తంగా ఎరిగించినాడు పోటిసుడు.
వామదేవుని కళ్లు కూడా చిప్పిల్లినాయి. “చివరికి నమ్మిన ఆడపిల్ల మనసును కూడా గాయం చేసి వచ్చినవా మిత్రమా!” అంటూ గుండెకు హత్తుకున్నాడు పోటిసుణ్ని. “దొరవారూ! ఇదంతా నేను చేసిన తప్పిదం. ఆరోజు నేను కర్తవ్యం మరచి, ఆడవాళ్లను కాపాడటానికి రాయవగ్గుతోపాటు వెళ్లకుండా ఉండి ఉంటే.. ఇన్ని అనర్థాలు జరిగేవి కాదు కదా!” అంటుంటే, పోటిసుణ్ని అడ్డుకుంటూ ఇట్లా అన్నది సౌగంధిక.. “నీ కథంతా వింటే ఎంతటి ఉత్తముడవో అర్థమవుతున్నది నాయనా! సద్గుణముల కెల్ల సదనమువే నీవు ఒక్క దోష మున్న లెక్కలేదు చందమామ నెట్లు నిందించ గలమయ్య మచ్చ గలదటంచు మాన్య మూర్తి! (ఓ గౌరవ జీవనా! అనేక సద్గుణాలకు నిలయం నీవు. చందమామలో మచ్చ వున్నదని నిందించ లేనట్లే, ఒక్క తప్పు కారణంగా నీ గొప్పతనాన్ని తక్కువ చేయలేము కదా!)” అన్నది. ఆ మాటలు విని చేతులెత్తి నమస్కరించినాడు పోటిసుడు. అంతలో భూగృహంపైన ఎవరో మనుషులు కదులుతున్న అలికిడి వినిపించింది.
* * *
పోదన నగరంలో.. జనం అంతా కుసుమ శ్రేష్ఠి భవన ప్రాంగణంలో తోలుబొమ్మలాట చూడటంలో లీనమైపోయి ఉన్నారు. కల్లణసీహుడి మాటలకు నాదస్వరానికి కట్టుబడ్డ నాగినిల్లా అతను చెప్పినట్లు వినసాగినారు. అతని కనికట్టు, మహేంద్రజాల విద్య మహత్తు అది. ఎంతో అరుదుగా లభించే అవకాశం తోలుబొమ్మలాట. అందరికీ ఎంతో ఇష్టమైన కళా ప్రదర్శన. అందమైన బొమ్మలు సజీవంగా ముందర కదలాడుతుంటే అదొక అద్భుతమైన అనుభూతి. ఈసారి ఎప్పుడూ చూసే ప్రదర్శనకు అదనంగా కల్లణసీహుడి మాయాజాలం మనసులను లోబరుచుకొని ప్రత్యక్షంగా లంకలో రామాయణం చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నది వాళ్లకు.
ముందుగా చేసుకున్న యోజన ప్రకారం కల్లణసీహుడి మనుషులు కొందరు రాక్షసుల ముఖచిత్రాలను తలకు తగిలించుకొని సిద్ధంగా ఉన్నారు. “భయపడకండి! మనం త్రికూట పర్వతం మీద ఉన్నాం కదా! లంకలోని రాక్షసులు మనకు అక్కడక్కడా కనిపిస్తుంటారు” అని కల్లణసీహుడు అనగానే ప్రేక్షకుల మధ్యన, వేదిక పక్కన అక్కడక్కడా రాక్షసులు కనిపించినారు. చిన్నపిల్లలు చూసి భయంతో కేకలు వేసినారు. ఆడవాళ్లు కూడా వణికి పోయినారు. మగవాళ్లు కొంతమంది వాళ్లకు ధైర్యం చెప్పసాగినారు. ఇదంతా గమనిస్తున్న కల్లణసీహుడు.. “మీరేం భయపడ నవసరం లేదు! ఆ రాక్షసులు మనల్ని ఏమీ చేయరు. మనం ఇప్పుడు లంకకు వెళ్లి ఆట చూస్తున్నాం. ప్రస్తుతం లంకా నగరంలో ఉన్నాం.. ఇదిగో లంక ఎంత అందంగా ఉందో చూడండి! ఆకాశాన్ని అంటే అందమైన భవనాలు; సుందరమైన వనాలు; గలగల పారే సెలయేళ్లు; చిన్నచిన్న కొండలు, గుట్టలు.. ఆహా రాజప్రాసాదం చూడండి! ఎంత బాగున్నదో!! ఇంద్ర వైభవాన్ని మించి ఉన్నది కదా!” అని వర్ణిస్తుంటే.. ఆ అమాయక ప్రేక్షకులు నిజంగానే లంకా నగరం ప్రత్యక్షంగా వీక్షిస్తున్న అనుభూతిని పొంద సాగినారు. మానవ జీవితమే భ్రమ! అందుకే మనిషికి భ్రమల పట్ల మమకారం ఎక్కువ. నిజ జీవితంలో సాధ్యపడనివి కలలో చూసుకొని తృప్తిపడతాడు; ఊహల్లో విహరించి సంతోషిస్తాడు. నశ్వరమైనవన్నీ శాశ్వతమన్న భ్రమలో బ్రతుకుతూ ఆత్మానందాన్ని పొందుతాడు.
అందరూ కల్లణసీహునికి వశులై, పరవశులై తోలుబొమ్మలాట చూడటంలో పూర్తిగా లీనమైపోయినారు. మామూలు తెర ముందు కదిలే బొమ్మలు సజీవ మూర్తులని అనుభూతించ సాగినారు. అందుకు తగినట్లుగానే వేరువేరు పాత్రలకు తగిన గొంతులు ఆ పాత్రలకు తగినట్లుగా ప్రత్యేకమైన మనుషులు అందిస్తుంటే, సందర్భాలకు సరిపడే నేపథ్య సంగీతం దృశ్యాలను సుందరంగా, సహజంగా సాక్షాత్కరింప జేస్తున్నాయి. ఆంజనేయునికి, రావణునికి మధ్య జరిగే సంవాదం తమ కళ్ల ముందరే జరుగుతున్నట్లు అనిపిస్తున్నది వాళ్లకు. ఆ మాటలకు స్పందిస్తూ చప్పట్లు చరుస్తూ.. “ఆహా! ఓహో!” అంటున్నారు వాళ్లు. చూస్తుండగానే ప్రదర్శన చివరి అంకానికి చేరుకున్నది. రాత్రి నాలుగవ జాములోకి ప్రవేశించింది. అంటే మరో రెండు గంటల్లో తెల్లవారుతుందన్నమాట. “ఈ కోతిని చంపేయండి!” అన్నాడు ఆంజనేయుని వైపు చూస్తూ రావణుడు. అప్పుడే రావణుని తమ్ముడు విభీషణుడు.. “అన్నా! దూతను వధించడం సంప్రదాయం కాదు. ఆ పని చేస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది!” అన్నాడు. “మరి వీడిని ఏం చేద్దామంటావు రా తమ్ముడా!” అన్నాడు రావణుడు. “ప్రాణహాని కలుగకుండా అవమానించి పంపవచ్చు!” అని సూచించినాడు విభీషణుడు. రావణుడు కొంచెం ఆలోచించి.. “అయితే.. వీనికి తోకనే బలం కదా! ఈ తోకను కాల్చండి. తిక్క కుదురుతుంది!” అన్నాడు. రాక్షసులు అంతా నవ్వినారు.
“నాయనా! ఈ తోక అంటుకోవాలంటే వస్త్రం చుట్టూ బాగా తైలం దట్టించాలి!” అన్నాడు రావణుని కొడుకు ఇంద్రజిత్తు. “అటులనే గావించుడు!” అన్నాడు రావణుడు. కల్లణసీహుడు ఆ దృశ్యాన్ని వర్ణిస్తూ ఉండగా.. ఆంజనేయుని తోక పెరిగింది. ప్రేక్షకుల్లో పాములా కదులుతున్న ఆ తోకను చూసి కొందరు భయపడ్డారు. తర్వాత కొందరు.. “ఆహా! ఆంజనేయుని తోకను కనులారా చూస్తున్నాం!” అని భక్తితో దండం పెట్టుకున్నారు. పెరిగిపోతున్న ఆంజనేయుని తోకకు చుట్టడానికి వస్ర్తాలు చాలడం లేదు. రాక్షసాకారులు జనం మధ్యన తిరుగుతూ.. “నీ కోక ఇవ్వు!” “నీ వస్త్రం ఇవ్వు!” “నీ తలపాగా ఇవ్వు!” అంటూ ఒక్కొక్కరి వద్ద వస్ర్తాలు తీసుకోసాగినారు. “ఎన్ని వస్ర్తాలు చుట్టినా చాలడం లేదు ప్రభూ! ఆ తోక అంతకంతకూ పెరిగిపోతున్నది..” అన్నాడు రావణునితో ఒక రాక్షసభటుడు. “అయితే.. అశోకవనంలో ఉన్న సీత చీర తీసుకొని రండి!” అన్నాడు రావణుడు. అంతే! ఆంజనేయుని తోక పెరగడం ఆగిపోయింది. “తోక పెరగడం ఆగిపోయింది ప్రభూ!” అన్నారు ఆనందంగా అరుస్తూ రాక్షసులు. “అయితే నిప్పు పెట్టేసేయండి!” అన్నాడు నవ్వుతూ రావణుడు. ఒక్కసారిగా వేదిక వద్ద భగ్గున మంటలు అంటుకున్నాయి. ఈ నేపథ్యంలో కుసుమ శ్రేష్ఠి భవనమంతటా కల్లణసీహుని మనుషులు గంధకంతో కూడిన తైలం చల్లడంతో మంటలు భవనమంతటా వేగంగా వ్యాపించసాగినాయి.
మానవ జీవితమే భ్రమ! అందుకే మనిషికి భ్రమల పట్ల మమకారం ఎక్కువ. నిజ జీవితంలో సాధ్యపడనివి కలలో చూసుకొని తృప్తిపడతాడు; ఊహల్లో విహరించి సంతోషిస్తాడు. నశ్వరమైనవన్నీ శాశ్వతమన్న భ్రమలో బ్రతుకుతూ ఆత్మానందాన్ని పొందుతాడు.అందరూ కల్లణసీహునికి వశులై, పరవశులై తోలుబొమ్మలాట చూడటంలో పూర్తిగా లీనమైపోయినారు. మామూలు తెర ముందు కదిలే బొమ్మలు సజీవ మూర్తులని అనుభూతించ సాగినారు. అందుకు తగినట్లుగానే వేరువేరు పాత్రలకు తగిన గొంతులు ఆ పాత్రలకు తగినట్లుగా ప్రత్యేకమైన మనుషులు అందిస్తుంటే, సందర్భాలకు సరిపడే నేపథ్య సంగీతం దృశ్యాలను సుందరంగా, సహజంగా సాక్షాత్కరింప జేస్తున్నాయి.