హైదరాబాద్ : కర్నాటక రాజకీయ ముఖచిత్రం నాటకీయ మలుపు తిరగబోతోంది. ఢిల్లీలో పార్టీ హైకమాండ్‌తో సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సిద్ధ రామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించవచ్చనే ఊహాగానాలు తీవ్రమయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కర్నాటక అగ్ర నాయకుల మధ్య దాదాపు ఏడు గంటల పాటు జరిగిన సమావేశాల అనంతరం ఈ ఉత్కంఠభరితమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ను నియమించాలని నిర్ణయించడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ నాయకత్వ పోరుకు ఎట్టకేలకు పరిష్కారం కనుగొనిందనే తీవ్రమైన ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రంలో తెర వెనుక తెరవెనుక బేరసారాలు మొదలయ్యాయి. అధికారంలో భాగస్వాములయ్యేందుకు పలువురు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్దు సన్నిహితుడు సతీష్ జార్కిహోళి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్నారని, ఆయన కుమారుడు డాక్టర్ యతీంద్రకు శివకుమార్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నట్ల తెలిసింది. సిద్ధ రామయ్యను రాజ్యసభకు పంపి అక్కడ ప్రతిపక్ష హోదా కట్టబెడుతారని, తన తనయుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి అప్పగిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం పదవి చెరో రెండున్నరేండ్లు పంచుకునేలా సిద్ధూ, డీకే మధ్య ఒప్పందం కుదిరిందని అప్పట్లో వార్తలు బయటకు వచ్చాయి.