Benjamin Netanyahu : తాను ప్రధానిగా ఉన్నంతకాలం పాలస్తీనా దేశంగా ఉండబోదని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఈ అంశంలో ట్రంప్ ప్రతిపాదనను కూడా నెతన్యాహు తిరస్కరించారు. ఇది ట్రంప్‌నకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. గాజాపై ఇజ్రాయెల్ చాలాకాలంగా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 15 అంశాల ప్రణాళికతో ఒక రోడ్‌మ్యాప్ ప్రకటించారు. హమాస్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలన్నది వాటిలో ఒకటి. ఈ ప్రణాళికకు పాలస్తీనాతోపాటు, ఇతర గల్ఫ్ దేశాలు అంగీకరించాయి.
ఇదే సమయంలో హమాస్ సంస్థ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే, ఇజ్రాయెల్ తమ డిమాండ్లకు అంగీకరించాలని హమాస్ కోరింది. కానీ, ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్ పీఎం వ్యతిరేకించారు. ట్రంప్ ప్రతిపాదనకు అంగీకరించేది లేదన్నారు. తాను ప్రధానిగా ఉన్నంతకాలం పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించబోమన్నారు. గాజాలో లేదా వెస్ట్‌బ్యాంక్‌లో ఎక్కడా పాలస్తీనా దేశాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రతిపాదనల్లో పాలస్తీనా దేశం ఏర్పాటు కూడా ఒకటి. అయితే, దీన్ని నెతన్యాహు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు.. ట్రంప్ ప్రతిపాదనను నెతన్యాహు వ్యతిరేకించడాన్ని 8 దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. యూఏఈ, ఖతార్, జోర్డాన్, ఇండోనేసియా, పాకిస్తాన్, తుర్కియే, సౌదీ అరేబియా, ఈజిప్ట్‌లు నెతన్యాహు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గాజాలో ఇంకా ఎంతకాలం ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని ప్రశ్నిస్తున్నాయి.
ఇజ్రాయెల్ ఈ శాంతి ఒప్పందానికి అంగీకరించకుంటే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల్ని ఉపసంహరించేది లేదన్నారు. హమాస్ ఉగ్రవాదులు పూర్తి నిరాయుధులుగా మారేంతవరకు తమ దళాలు అక్కడే ఉంటాయన్నారు. ఇదే సమయంలో ఇరాన్‌పై కూడా భారీ దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ సైన్యానికి సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఇరాన్‌పై దాడికి ముందు కూడా ఇలాగే సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.