Ratnavelu | హైదరాబాద్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్దిపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మీడియాతో మాట్లాడిన సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా కథను వెండితెరపై ఆవిష్కరించిన విధానం అద్భుతంగా వచ్చిందని రత్నవేలు తెలిపారు. “బుచ్చిబాబు రాసుకున్న కథ కంటే తెరపై అది మరింత గొప్పగా ఆవిష్కరించబడింది. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్‌చరణ్‌ను ప్రేక్షకులు పూర్తిగా కొత్త కోణంలో చూస్తారు” అని చెప్పారు.
ఈ సినిమా కథ సుమారు 40 ఏళ్ల క్రితం నాటి విజయనగరం నేపథ్యంతో సాగుతుందని రత్నవేలు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ప్రాంతం పూర్తిగా మారిపోవడంతో పాతకాలపు వాతావరణాన్ని తెరపై చూపించడం పెద్ద సవాల్‌గా మారిందన్నారు. దీనికోసం చిత్ర బృందం పాత ఫొటోలు, ప్రాంతీయ చరిత్ర ఆధారంగా 1980ల నాటి క్లాక్ టవర్, వీధులు, షుగర్ ఫ్యాక్టరీ వంటి అనేక అంశాలను ప్రత్యేకంగా రీక్రియేట్ చేసిందని చెప్పారు. ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్లేలా ప్రత్యేక రంగుల టోన్, విజువల్ మూడ్‌ను సెట్ చేశామని తెలిపారు. సినిమాలో అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చే రెండు ప్రధాన ఎపిసోడ్లు ఉన్నాయని రత్నవేలు పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా రెండో క్రికెట్ మ్యాచ్ కథకు కీలక మలుపు అవుతుందని తెలిపారు. ఈ మ్యాచ్‌ను రాత్రి సమయంలో చిత్రీకరించాలనే తన సూచనకు దర్శకుడు వెంటనే అంగీకరించారని చెప్పారు.
ఈ ఎపిసోడ్ సాధారణ ఆటలా కాకుండా రెండు బలమైన జట్ల మధ్య జరిగే యుద్ధంలా కనిపిస్తుందని తెలిపారు. మరోవైపు కుస్తీ పోటీల సీక్వెన్స్ కూడా చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. ఈ పాత్ర కోసం రామ్‌చరణ్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుని నిజమైన పహిల్వాన్లా కనిపించారని ప్రశంసించారు. ముఖ్యంగా హనుమంతుడి రిఫరెన్స్‌తో వచ్చే ఒక యాక్షన్ బ్లాక్ థియేటర్లలో ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని వెల్లడించారు. సినిమాలో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ తనకు అత్యంత ఇష్టమైన భాగమని రత్నవేలు తెలిపారు. ఆ సన్నివేశాల కోసం కృత్రిమ లైటింగ్‌కు బదులుగా సహజత్వాన్ని తీసుకురావడానికి దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్లీ ఫిల్మ్ నెగటివ్ ఉపయోగించామని చెప్పారు. అలాగే సినిమా చివరి 30 నిమిషాలు భావోద్వేగాలతో నిండిపోతాయని వెల్లడించారు. గ్రాండియర్ విజువల్స్‌తో పాటు ప్రేక్షకుల మనసులను తాకే ఎమోషన్స్ కూడా క్లైమాక్స్‌లో ఉంటాయని చెప్పారు.