వరంగల్, ఫిబ్రవరి 28 : ఓరుగల్లు గడ్డపై తొలిసారిగా చేసిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. నిట్, కాకతీయ పట్టణాభివృది సంస్థ సహకారంతో చేసిన రుద్రమ -1 రాకెట్ గాలిలోకి ఎగిరిన క్షణాల్లో నేల కూలింది. రెండోసారి చేసిన రాకెట్ ప్రయోగం సైతం ఫలించలేదు. కుడా అధికారులు చేసిన ఆర్భాట ప్రచారంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు, నగర ప్రజలు నిరాశకు లోనయ్యారు. వరంగల్ భద్రకాళీ బండ్‌పై చేసిన రుద్రమ -1 రాకెట్ లాంచ్ నింగిలోకి ఎగిరిన క్షణాల్లో నేల కూలింది. నాలుగు అడుగుల ఎత్తుతో 250 గ్రాముల బరువు కలిగిన రెండు రాకెట్లు ప్రయోగించినా ఏ ఒక్కటి విజయవంతం కాలేదు. తేలిక పాటి ప్లాస్టిక్, బాల్సా ఉడ్, ఫైబర్‌తో తయారు చేసిన రుద్రమ-1 మోడల్ రాకెట్ 300 మీటర్ల ఎత్తు వరకు వెళ్తుందని విస్తృత ప్రచారం చేశారు.
ఆకాశంలోకి వెళ్లిన తర్వాత తిరుగు ప్రయాణంలో ప్యారాచూట్ ద్వారా విజయవంతంగా నేల మీదకు దిగుతుందని చెప్పారు. చివరికి రుద్రమ రాకెట్ 50మీటర్ల పైకి ఎగిరి కింద పడడంతో అక్కడి వచ్చిన వారంతా ఖంగుతిన్నారు. కాగా, పరీక్షల సమయంలో రాకెట్ ప్రయోగం సరియైంది కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుడా ఏది చేసినా ఆర్బాట ప్రచారమే తప్పా.. ఏం ఉండదన్న అపవాదును మరోసారి రుజువు చేసుకున్నది. పది రోజులు రాకెట్ లాంచ్‌పై విస్తృత ప్రచారం కల్పించింది.
కాళోజీ కళాక్షేత్రంలో ఇస్రో శాస్త్రవేత్తలతో గెస్ట్ లెక్చర్, తొలుత హయగ్రీవాచారి మైదానంలో రాకెట్ లాంచ్ అని చెప్పిన కుడా చివరి రెండు రోజుల్లో వేదికను భద్రకాళీ బండ్‌పైకి మార్చింది. ప్రయోగం సఫలం కాలేదు. రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో అక్కడి వచ్చిన ప్రజాప్రతినిధులు మెల్లగా జారుకున్నారు. రాకెట్ లాంచ్‌ను వీక్షించేందుకు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ భద్రకాళీ బండ్‌కు వచ్చారు. రాకెట్ గాలిలోకి ఎగిరిన క్షణాల్లో నేలకూలడంతో వారంతా అక్కడి నుంచి మౌనంగా వెళ్లి పోయారు. రెండో రాకెట్ ప్రయోగం చేసే వరకు కుడా వారు అక్కడ ఉండకుండా వెనుతిరిగి వెళ్లి పోయారు.