నందికొండ, జూలై 16 : వైటీపీఎస్ ప్రైవేటీకరణ ప్రక్రియను నిరసిస్తూ టీజీపీఈఏ జేఏసీ పిలుపు మేరకు నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రంలో గత 22 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బొగ్గు, బూడిద విభాగాల నిర్వహణను రూ.255 కోట్లతో మూడేళ్ల పాటు ప్రైవేటుకు అప్పగించే టెండర్ ప్రక్రియ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం 22వ రోజు భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు నల్ల బ్యాడ్జిలు ధరించి, ప్రధాన గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో కీలకమైన విభాగాలను ప్రైవేటీకరించడం వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతినడంతో పాటు పనిభారం పెరగడం, అనుభవజ్ఞులైన నైపుణ్యాన్ని పక్కన పెట్టడం, భద్రతా ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వైటీపీఎస్ ప్లాంట్ నందు ఉన్న ఏహెచ్‌పీ అండ్ సీహెచ్పీల ప్రైవేటీకరణ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్య రాబోయే రోజుల్లో విద్యుత్ రంగంలో మరిన్ని విభాగాలను ఔట్ సోర్సింగ్ లేదా ప్రైవేటీకరణ పేరుతో బలహీనపరిచే ప్రయత్నాలకు నాంది కావచ్చునని, తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఇంజినీరింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.