నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. దీనినే ‘స్టూడెంట్ బర్నౌట్’ అని అంటారు. చదువుల భారం, పరీక్షల భయం, భవిష్యత్తుపై ఆందోళన విద్యార్థులను శారీరకంగా, మానసికంగా అలసటకు గురిచేస్తున్నాయి. కేవలం చదువులో వెనుకబడటం మాత్రమే బర్నౌట్ కాదు. నిరంతర శ్రమ వల్ల మెదడు, శరీరం పూర్తిగా అలసిపోయి, చదువుపై ఆసక్తి తగ్గడాన్ని ‘బర్నౌట్’ అంటారు. ఇది దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కలుగుతుంది.
విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఒత్తిడికి సంబంధించిన గణాంకాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి.
ఒక అంచనా ప్రకారం, భారతదేశంలోని 40% మంది టీనేజర్లు నిరంతర ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నారు.
మెడికల్ చదువుతున్న విద్యార్థులలో దాదాపు 60% నుంచి 80% మంది బర్నౌట్ లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
30 భారతీయ విశ్వవిద్యాలయాలలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతి 10 మందిలో ఒక విద్యార్థి గత ఏడాదిలో ఆత్మహత్య ఆలోచనలను కలిగి ఉన్నట్లు తేలింది.
ఒక సర్వే ప్రకారం విద్యార్థులపై ఒత్తిడికి కారణమయ్యే అంశాల శాతం ఇలా ఉంది. పరీక్షల భయం- ఫలితాల ఆందోళనలో 45 శాతం మంది విద్యార్థులు, తల్లిదండ్రులు-సామాజిక అంచనాల మధ్య చిక్కుకొని 30 శాతం మంది, భవిష్యత్తుపై అనిశ్చితితో 15 శాతం మంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఆర్థిక, వ్యక్తిగత కారణాల వల్ల 10 శాతం మంది ఒత్తిడికి గురవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, ఇవి మన విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
విద్యార్థి బర్నౌట్కు గురైనప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
విద్యార్థులు ఒత్తిడిని తగ్గించుకుని, చదువులో రాణించడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను సాధించవచ్చు.
ఒకేసారి గంటల తరబడి చదవడం వల్ల మెదడు అలసిపోతుంది. దానికి బదులుగా ఈ పద్ధతిని పాటించండి. 25 నిమిషాలు ఏకాగ్రతతో చదవండి. ఐదు నిమిషాలు చిన్న విరామం తీసుకోండి. ఇలా నాలుగుసార్లు చేసిన తర్వాత 15-30 నిమిషాలు పెద్ద విరామం తీసుకోండి. ఇది మీ ఏకాగ్రతను రెట్టింపు చేస్తుంది.
చదివిన దానిని పదే పదే చదవడం కంటే, పుస్తకం మూసివేసి మీకు గుర్తున్న పాయింట్లను ఒక పేపర్ మీద రాయడం లేదా మీకు మీరు వివరించుకోండి. ఇది
సమాచారాన్ని మెదడులో ఎక్కువ కాలం దాచుకోవడానికి సాయపడుతుంది.
ముఖ్యమైన అంశాలను సొంత మాటల్లో రాసుకోండి. డయాగ్రామ్స్, మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్ ఉపయోగించడం వల్ల క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి.
పరీక్షల సమయంలో నిద్రను నిర్లక్ష్యం చేయకండి. మెదడు సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవాలంటే నిద్ర చాలా ముఖ్యం. జంక్ ఫుడ్ తగ్గించి పండ్లు, నీరు ఎక్కువగా తీసుకోండి.
హాబీలకు ప్రాధాన్యం.. చదువు మధ్యలో ఇష్టమైన పనులు (సంగీతం వినడం, పెయింటింగ్ లేదా ఆటలు) చేయడం వల్ల మెదడు రీచార్జ్ అవుతుంది. ఒత్తిడి భరించలేనప్పుడు ఉపాధ్యాయులతో లేదా తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడాలి. ఎంతసేపు చదివామన్న దానికంటే ఎంత క్వాలిటీ గా చదువుతున్నామన్నది ఫలితాలను నిర్దేశిస్తుందన్న విషయం విద్యార్థులు గుర్తించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తుంచాల్సింది ఏమిటంటే మార్కుల కంటే పిల్లల మానసిక ఆరోగ్యం ముఖ్యమని. దీనిపై అందరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
చేయాల్సింది: ప్రతి రోజూ ప్లాన్ ప్రకారం చదవడం.
చేయకూడనిది: చివరి నిమిషం వరకు చదువును వాయిదా వేయడం.
చేయాల్సింది: సందేహాలను వెంటనే అడిగి తెలుసుకోవడం.
చేయకూడనిది: అర్థం కాకపోయినా బట్టీ పట్టడం.
చేయాల్సింది: చదివేటప్పుడు ఫోన్ను దూరంగా ఉంచడం.
చేయకూడనిది: సోషల్ మీడియా నోటిఫికేషన్లు చూస్తూ చదవడం.
చేయాల్సింది: కనీసం 20 నిమిషాల శారీరక వ్యాయామం.
చేయకూడనిది : నిరంతరం కూర్చునే ఉండటం.