తిరుమల : తిరుమల ( Tirumala ) లోని సీఆర్వో కార్యాలయం వద్ద నకిలీ గుర్తింపు పత్రాలతో వేరొకరి పేర్లతో గదులు పొంది వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న దళారీ ముఠా ప్రయత్నాన్ని టీటీడీ విజిలెన్స్ ( TTD Vigilence ) విభాగం భగ్నం చేసింది. ఈనెల 16న అప్పటికే ఒక గది పొందిన వ్యక్తి మరో గుర్తింపుతో తిరిగి గది కోసం క్యూలో నిలబడటాన్ని సీఆర్వో కార్యాలయం సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో అతడిని కేరళ మలప్పురం జిల్లాకు చెందిన ఆషిక్ అలీ పి.ఎం. (32)గా గుర్తించారు. అతని వద్ద రెండు నకిలీ ఆధార్ కార్డులు, గది రిజిస్ట్రేషన్ స్లిప్, రూ.800 నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.రంజిత్ అనే దళారి ఒక్కో గదికి రూ.1,000 చొప్పున ఇస్తామని తనను నియమించుకున్నట్లు ఆషిక్ విచారణలో వెల్లడించాడు. విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు తిరుమల-2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఎవరైనా దళారి డబ్బు తీసుకుని గది ఇప్పిస్తానని సంప్రదించినా లేదా అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే టీటీడీ విజిలెన్స్ , సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ నెం: 9866898630 లేదా టీటీడీ కాల్ సెంటర్ నెం : 155257 కు సమాచారం ఇవ్వాలని భక్తులకు సూచించారు.