‘కోర్ట్’ జోడీ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన వినోదాత్మక యువతరం సినిమా ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకుడు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. మార్చి 13న సినిమా విడుదల కానున్నది. గత శనివారం విడుదలైన ఈ సినిమాలోని తొలిపాట ‘తిప్పుకుంటన్నావ్..’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. ఈ క్రమంలోనే ఈ శనివారం ఈ సినిమాలోని రెండోపాటను విడుదల చేశారు. ‘పల్లెలోని సందళ్లన్నీ మీవే..’ అంటూ సాగే ఈ మెలొడీ సాంగ్‌ని అగ్ర హీరో రవితేజ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
చంద్రబోస్ రాసిన ఈ పాటను విజయ్ బుల్గానిన్ స్వరపరచగా, శ్వేతా మోహన్ ఆలపించారు. హీరోహీరోయిన్ల స్కూల్, చైల్డ్ మెమొరీస్‌ను గుర్తుచేసేలా ఈ పాట సాగింది. హర్ష్ రోషన్, శ్రీదేవి ఈ పాటలో స్కూల్ యూనిఫాంలో కనిపించారు. ఈ పాటలో వారి అల్లరి ఆడియన్స్‌ని మంత్రముగ్థుల్ని చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, నిర్మాణం: కోన ఫిల్మ్ కార్పొరేషన్.