KTR | రాజన్న సిరిసిల్ల : రాష్ట్రం ఏర్పడ్డాక ఎనిమిదేండ్ల పాటు సిరిసిల్ల నేతన్నలను అన్ని రకాలుగా ఆదుకుని, చేతి నిండా పని కల్పించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లను మరో తిర్పూర్ చేయాలని సంకల్పించాం.. కానీ ఈ పిచ్చోడికి అర్థం కావడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టు తెలంగాణలో ఆత్మహత్యలు జరగొద్దని చెప్పి ఎనిమిదేండ్ల పాటు 3,312 కోట్ల ఆర్డర్లు సిరిసిల్లకు ఇచ్చారు కేసీఆర్. దీంతో ఆత్మహత్యలు బంద్ అయ్యాయి. ఆదాయం డబుల్ అయింది. ఈ క్రమంలోనే ఆధునీకరణ వైపు ఆలోచనలను చేస్తూ సిరిసిల్లను మరో తిర్పూర్ చేయాలని సంకల్పించారు కేసీఆర్. రెండు మూడు బస్సుల్లో తమిళనాడులోని తిర్పూర్, కోయంబత్తూరుకు నేతన్నలను పంపించాం. ఎందుకంటే మరో తిర్పూర్ మాదిరిగా సిరిసిల్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో. జీతాలు డబుల్ అయి, ఆత్మహత్యలు ఆగి ఇప్పుడిప్పుడు ముఖం తెలివికి వస్తున్న సమయంలోనే మా ప్రభుత్వం పోయి దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని కేటీఆర్ తెలిపారు.
దిక్కుమాలిన ప్రభుత్వం అని ఎందుకు అంటున్నాను అంటే.. వారికి బుర్ర లేదు. నా మీద కోపంతో.. ఆ కక్షను సిరిసిల్ల ప్రజలు, నేతన్నల మీద తీర్చుకుంటున్నారు రేవంత్. మొత్తం బతుకమ్మ చీరలు ఆర్డర్లు బంద్ చేశారు. బతుకమ్మ చీరల్లో కుంభకోణం లంబకోణం జరిగిందని డైలాగ్‌లు కొట్టారు. ఎంక్వైరీ చేసుకోమని శాసనసభా వేదికగా చెప్పాను. సూరత్ నుంచి తీసుకొచ్చారని సీఎం సన్నాయి నొక్కులు నొక్కబోతే.. మొదటి ఏడాది కొంత తెచ్చాం.. ఆ రోజున్న డైరెక్టరే, ఇప్పుడు సెక్రటరీగా ఉన్నారు. ఎంక్వైరీ చేసుకోమని చెప్పాను. కానీ ముందుకు రాలేదు. కుంభకోణం లేదు.. లంబకోణం లేదు.. నీవు ఓ పిచ్చోడివి అని చెప్పాను. నిజంగానే పిచ్చోడు.. తెల్వదు ఆయనకు. తెల్వది అన్న విషయం కూడా ఆయనకు తెల్వదు. చెప్తే వినడు. నేత కార్మికులు మళ్లీ చనిపోతున్నారని గుర్తు చేశాను. ఆత్మహత్య చేసుకున్న 22 మంది చేనేత కార్మికుల జాబితా ఇచ్చాను. మనసుంటే సాయం చేయమని చెప్పాను. ఇంత వరకు స్పందన లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. మీ ప్రభుత్వం వచ్చాక పెద్ద పెద్ద మాటలు నరికారు మంత్రులు, స్థానిక నాయకులు. చేనేత కార్మికులకు 365 రోజులు ఉపాధి కల్పిస్తామన్నారు. నాలుగైదు రోజులైతే 11 నెలలో అడుగు పెడుతుంది ఈ ప్రభుత్వం. మరి ఈ కాలంలో ఏం సాధించారు. మా ప్రభుత్వంలో మొత్తం తొమ్మిదిన్నరేండ్లలో సిరిసిల్లకు 3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చాం. మరి మీరు 365 రోజులు ఉపాధి కల్పించాలని అనుకున్నారు కదా.. ఆర్డర్లు డబుల్ ఇవ్వాలి కదా. నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు. తెలిసీ తెలియని కాంగ్రెస్ సన్నాసుల మాటలకు ఆగం కావొద్దు. మీ తరపున కొట్లాడుతాం.. మీరు కూడా పోరాటానికి ముందుకు రావాలి. వారి ఎత్తుగడలకు ఆగం కాకండి అని కేటీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | నా మీద కోపంతో.. నేతన్నల మీద కక్ష తీర్చుకుంటున్నాడు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
Rains Alert | తెలంగాణలో మరో రెండురోజులు కొనసాగనున్న వానలు..