హైదరాబాద్/ సంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదం తెలుగు రాష్ర్టాల్లో విషాదం నింపింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదం. ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 51కి పెరిగింది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ కార్మికులు, సిబ్బంది మృతదేహాలు వెలికి వస్తూనే ఉన్నాయి. ప్రమాదంలో 36 మంది మరణించినట్టు మంగళవారం సాయంత్రం అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు 14 మందిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా వారిని గుర్తించాల్సి ఉన్నది. మరోవైపు, తమ వారు బతికున్నారో, లేదో తెలియక బాధిత కుటుంబ సభ్యులు నరకం అనుభవిస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ర్టాలకు చెందినవారే.
సిగాచి పరిశ్రమలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగూ వచ్చింది. ఇప్పటి వరకు 51మంది మృతి చెందినట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. సోమవారం ప్రమాదం జరగడానికి ముందు మొదటి షిప్టుకు 143 మంది కార్మికులు హాజరయ్యారు. వీరిలో కార్మికులతోపాటు అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కూడా ఉన్నారు. వారు విధుల్లో ఉండగా ఉదయం 9.18 గంటల ప్రాంతంలో కంపెనీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో ప్రొడక్షన్ ప్రాంతం, ల్యాబ్స్ ఇతర భవనాలు కూలిపోయాయి. పేలుడు థాటికి పక్కనే ఉన్న మూడంతస్తుల అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తొలిరోజున 12 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద సంఖ్యలో మృతదేహాలను వెలికితీశాయి. ఇప్పటి వరకు 51 మంది చనిపోయినట్టు తెలుస్తున్నా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తున్నది. వేర్వేరు దవాఖానల్లో 34 మంది చికిత్స పొందుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం సిగాచి పరిశ్రమను సందర్శించి ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పటాన్చెరు దవాఖానలో క్షతగ్రాతులను, బాధిత కుటుంబాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సిగాచి పరిశ్రమను సందర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని జాన్‌వెస్లీ ఆరోపించారు.
ప్రమాదంలో మృతి చెందిన వారిలో 14 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీరిలో ఆరుగురు తెలుగు రాష్ర్టాలకు చెందినవారు ఉన్నారు. జీవీ నాగేశ్వర్రావు(మంచిర్యాల), నిఖిల్‌కుమార్(కడప), పోలిశెట్టి ప్రసన్న(తూర్పుగోదావరి), బోరిగుట్ట హేమచందర్(వేటువంక,చిత్తూరు), శ్రీరమ్య(కడప), దాసరి సునీల్‌కుమార్ (ప్రకాశం) ఉన్నారు. వీరి మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగించారు. అలాగే, నాగజిత్ తివారి(ఒడిశా), శశిభూషణ్ అలియాస్ అభిషేక్‌కుమార్(బీహార్), జగన్మోహన్(ఒడిశా), రాంసింగ్ రాజ్‌బార్(నగరా,ఉత్తర్‌ప్రదేశ్), రుక్సానా ఖాతూన్(బీహార్), నిఖిల్‌కుమార్‌రెడ్డి(కడప), మనోజ్రౌత్(యూపీ), డోలా గోవింద్ సాహు(ఒడిశా), రాజ్‌కుమార్(బీహార్) మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
సిగాచి ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు 70 నుంచి 90 శాతం కాలిపోవడంతో వాటి గుర్తింపు అధికారులకు సవాలుగా మారింది. దీంతో డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతదేహాలను గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం పటాన్చెరు ప్రభుత్వ దవాఖానలోని మార్చురీలో ఉన్న 23 మృతదేహాల నుంచి హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ ల్యాబరేటరీ సిబ్బంది డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. బాధిత కుటుంబాల శాంపిల్స్‌ను సైతం తీసుకున్నారు. ఫలితాలు వచ్చేందుకు రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నది.
సిగాచి పరిశ్రమలో అతిపెద్ద ప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో కార్మికులు మృతి చెందినా కంపెనీ ప్రతినిధులు ఎవరూ సంఘటన స్థలానికి రాలేదు. దీంతో కంపెనీ ప్రతినిధులు తీరుపై అటు అధికారులు ఇటు బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కంపెనీ ప్రతినిధుల గురించి ఆరా తీయగా ఎవరూ రాలేదని అధికారులు సమాచారం చెప్పారు. దీంతో కంపెనీ తీరుపై సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సిగాచి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై కార్మిక సంఘాలు, కార్మికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
14 మంది కార్మికుల మృతదేహాల గుర్తింపు
10 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత
22 మంది కోసం డీఎన్ఏ
పటాన్చెరు, జూలై 1: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల్లో 14 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. 10 మంది కార్మికుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబాలకు మంగళవారం రూ.లక్ష చొప్పున తక్షణ ఆర్థికసాయాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అందజేశారు. మరో నాలుగు మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 22 మంది కార్మికుల మృతదేహాలను గుర్తించేందుకు కార్మికుల కుటుంబసభ్యుల నుంచి రక్త నమూనాలను డీఎన్ఏ పరీక్షల కోసం సేకరించారు.
గుర్తించిన కార్మికుల వివరాలు
పేరు – వయసు – ప్రాంతం
నాగనజిత్ తివారీ (20) – (ఒడిశా)
శశిభూషణ్ అలియాస్ అభిషేక్
కుమార్ (20) – (బీహార్)
బోరిగుట్ట హేమసుందర్ (45) – చిత్తూరు (ఏపీ)
రాజనాల జగన్మోహన్ (55) – (ఒడిశా)
రామ్‌సింగ్ రాజ్బర్ (49) – (యూపీ)
నాగేశ్వర్రావు (52) – (తెలంగాణ)
రుక్సానా ఖతును (38) – (బీహారు)
నిఖిల్‌కుమార్‌రెడ్డి(33) – కడప (ఏపీ)
పీ ప్రసన్న(22) – (ఏపీ)
శ్రీరావ్య – (ఏపీ)
మనోజ్ రౌత్ (22),
డోలాగోవింగ్ (31) – (ఒడిశా)
రాజుకుమార్ (30) – (బీహారు)
దాసరి సునీల్‌కుమార్ (25) –
ప్రకాశం జిల్లా (ఏపీ)