హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వన్నంగా తయారైంది. సూది ఉంటే మందు ఉండదు, మందు ఉంటే సూది ఉండదు. సూది, మందు ఉంటే వైద్యుడు ఉండడు అన్నచందంగా మారిపోయింది. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగువెలిగిన గవర్నమెంట్ హాస్పిటల్స్ కాంగ్రెస్ పాలనలో మసకబారాయి. తాజాగా వరంగల్(Warangal) జిల్లా నర్సంపేటలో ఏర్పాటైన జిల్లా హాస్పిటల్లో మందుల కొరతతో (Medicines)రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ మందులు కూడా లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐవీ సెట్లు కూడా బయట కొనాల్సిన పరిస్థితి ఉంది. రాన్ట్యాక్, పాన్టాప్, జోఫార్, డైక్లి, డైసైక్లోమిన్, పాం, ఎవిల్ వంటి ఇంజెక్షన్లు, మాత్రలు.. పాము, విషపు పురుగుల కాటుకు గురైతే ఇచ్చే పాం ఇంజెక్షన్లు కూడా లేవు.కడుపు నెప్పి, వాంతులు, ఒంటి నొప్పుల నివారణ మాత్రల్లేవు.. సాధారణ మందులు కూడా లేకపోవడంతో అర్ధరాత్రి పూట వైద్యానికి వెళ్లే రోగులు బయట మందుల షాపులు మూసి ఉండడంతో అవస్థలు పడుతున్నారు.
చెన్నారావు పేటకు చెందిన ఓ వివాహిత పురుగుల మందు తాగి హాస్పిటల్లో చేరితే ఆమెకు ఉప్పు నీరు తాపించి వాంతి చేయించారు. కాగా, మందుల కొరతపై హాస్పిటల్ ఆర్ఎంవో స్పందించారు. అవును మందుల కొరత నిజమే, దీనిపై అధికారులకు తెలిపాం. వాళ్లు పట్టించుకోవడం లేదంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపంగా మారాయి.