పెద్దపల్లి : ముత్తారం కేజీబీవీలో అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో( KGBV students) ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 53 మంది విద్యార్థినిలు ఆదివారం రాత్రి పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో చేరగా.. ఆరోగ్యం కుదుట పడటంతో సోమవారం 39 మందిని, మంగళవారం 6 గురిని డిశ్చార్జి చేశారు. అయితే 8 మందిలో నలుగురికి దగ్గు తీవ్రత తగ్గకపోవడంతో సోమవారం రాత్రి కరీంనగర్‌కు తరలించారు. అక్కడ కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో రేవతి, సునీత, రక్షితలను హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
కాగా, పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే వారిని పెద్దపల్లి దవాఖానకు తరలించి చికిత్స అందించారు. తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పాఠశాల పరిధిలో గడ్డి మందు కొట్టించగా.. అదే గడ్డిని ఆదివారం విద్యార్థినులతో తొలగించారు. ఆ ప్రభావం వల్ల జరిగిందా? లేక ఫుడ్ పాయిజన్ జరిగిందా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.