దుబాయ్ : పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకోవాలన్న తాపత్రయంలో దేశం వీడుతున్న వేలాదిమంది పౌరులు తమ పెంపుడు జంతువులను తమ వెంట తీసుకెళ్లలేక అక్కడే వదిలిపెడుతుండడంతో దుబాయ్ వీధులు పెంపుడు కుక్కలు, పిల్లులు, కుందేళ్లతో నిండిపోతున్నాయి. కొందరు తమ పెంపుడు జంతువులను వీధుల్లో వదిలిపెడుతుండగా మరికొందరు మాత్రం వాటి సంరక్షణ చూసుకోవాలని వేడుకుంటున్నట్లు దుబాయ్‌లోని జంతు సంరక్షకులు, వైద్యులు వెల్లడించారు. యూఏఈలో దాదాపు 20 లక్షలకు పైగా పెంపుడు జంతువులు ఉన్నట్లు ఓ అంచనా. దుబాయ్‌తో సహా దేశవ్యాప్తంగా కుక్కల కన్నా పిల్లుల సంఖ్య ఎక్కువ. 64.98 శాతం మంది పిల్లులనే పెంచడానికి ఇష్టపడతారు. పెంపుడు జంతువులు వీధుల్లో అనాథలుగా మారుతున్న సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని యూఏఈలో వీధి కుక్కలకు ఆశ్రయమిచ్చే కే9 ఫ్రెండ్స్ దుబాయ్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. సాధ్యమైనన్ని ఎక్కువ జంతువులకు ఆశ్రయమిచ్చేందుకు తాము కృషి చేస్తున్నామని, కాని షెల్టర్లన్నీ పూర్తిగా నిండిపోయాయని దుబాయ్‌కు చెందిన పెట్ బోర్డింగ్ సంస్థ ది బార్కింగ్ లాట్ పేర్కొన్నది.
వీధులన్నీ వదిలేసిన పెంపుడు జంతువులతో నిండిపోతున్నాయని, వాటికి ఆశ్రయం కల్పించడం అసాధ్యంగా మారిందని జంతు సహాయక కేంద్రాలకు చెందిన వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తమ యజమాని సంరక్షణలో సురక్షితంగా పెరిగిన పెంపుడు శునకాలు ఇప్పుడు దుబాయ్ వీధుల్లో అనాథలుగా తిరుగుతున్నాయి. కొన్నింటిని వాటి యజమానులు కరెంటు స్తంభాలకు కట్టేసి వదిలివెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఒమన్ మీదుగా యూఏఈ సరిహద్దులను దాటేందుకు ప్రయత్నిస్తున్న కొందరు పౌరులు తమ పెంపుడు జంతువులను ఎడారిలో వదిలిపెట్టి వెళ్లిపోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. యూఏఈ సరిహద్దు దాటుతున్న వారు తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎడారిలో వాటిని వదిలిపెడుతున్నట్లు తెలుస్తున్నది. వీధుల్లోని జంతువుల సమస్యను పరిష్కరించేందుకు దుబాయ్ మున్సిపాలిటీ రంగంలోకి దిగింది. వాటిని ట్రాక్ చేసేందుకు మొట్టమొదటిసారి ఎహ్సాన్ స్టేషన్ పేరిట ఏఐతో పనిచేసే స్మార్ట్ పరికరాలను ప్రవేశపెట్టింది.