Amitabh Bachchan | వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తున్న అరుదైన వ్యక్తుల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు. 83 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం, అదే క్రమశిక్షణతో నటుడిగా, హోస్ట్‌గా కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తూ భారతీయ వినోద రంగంలో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. పెద్ద తెరపై విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూనే, మరోవైపు బుల్లితెరపై ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) కార్యక్రమానికి వ్యాఖ్యాతగా విజయవంతంగా కొనసాగుతున్నారు. యుక్తవయసులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు ఎదుర్కొన్నప్పటికీ అమితాబ్ బచ్చన్ తన జీవనశైలిని ఎప్పటికప్పుడు క్రమబద్ధంగా మార్చుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. సరైన ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన దినచర్య కారణంగానే 83 ఏళ్ల వయసులోనూ ఆయన అదే ఉత్సాహంతో కెమెరా ముందు నిలుస్తున్నారు.
ప్రస్తుతం వివిధ భాషల్లో రియాలిటీ షోలను హోస్ట్ చేస్తున్న స్టార్ నటులతో పోలిస్తే అమితాబ్ వయసులో పెద్దవారే. తెలుగు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున, హిందీ బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్‌లాల్, కన్నడలో కిచ్చా సుదీప్ తమ తమ షోలను విజయవంతంగా నడిపిస్తున్నప్పటికీ, అమితాబ్ చూపిస్తున్న ఎనర్జీ, వాక్చాతుర్యం ప్రేక్షకులను ఇప్పటికీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 18వ సీజన్ కోసం అమితాబ్ బచ్చన్ ఇప్పటికే షూటింగ్‌కు సిద్ధమయ్యారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు, మాక్ షూట్లు పూర్తి చేసుకున్న ఆయన త్వరలోనే షూట్ లో పాల్గొననున్నారు. రీసెంట్గా తన బ్లాగ్ ద్వారా “మాక్ షూట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వెళ్లే అసలు ప్రయాణం మొదలవుతోంది” అంటూ సెట్స్ నుంచి కొన్ని బిహైండ్ ది సీన్స్ ఫొటోలను పంచుకున్నారు.
కొత్త సీజన్‌పై ఆసక్తిని పెంచుతూ అమితాబ్ మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. “ఈసారి మా ప్రోమోలో చెప్పినట్లుగానే… ప్రేక్షకులు కాస్త ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది” అంటూ KBC 18లో కొత్తదనం ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చారు. KBC 18వ సీజన్ ఆగస్టు 10 నుంచి సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్‌లో ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, మరోసారి అమితాబ్ తన ప్రత్యేక హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.