(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పది రోజుల కిందట మొదలైన ఉద్రిక్తతలు చమురు నిక్షేపాల ధ్వంసంతో మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఇరాన్‌ను గట్టిగా దెబ్బకొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన ‘ఖర్గ్ ద్వీపం’పై దాడులకు ట్రంప్ యోచిస్తున్నట్టు సమాచారం.
పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ తీరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ‘ఖర్గ్’ ఉంటుంది. 20 చదరపు కిలోమీటర్ల అతి తక్కువ వైశాల్యంతో ఉన్నప్పటికీ.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముకగా చెప్తారు. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతం వాటా దీనిదే. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, 2024లో ఈ ద్వీపం నుంచి చమురు ఎగుమతుల ద్వారా ఇరాన్ 78 బిలియన్ డాలర్లను ఆర్జించింది. దీన్ని బట్టి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నడవాలంటే ఇక్కడి చమురు ఎగుమతులే కీలకమన్న విషయం అర్థమవుతున్నది. ఖర్గ్‌లోని లోడింగ్ టర్మినళ్లు రోజుకు ఏడు మిలియన్ బ్యారెళ్ల చమురును హ్యాండిల్ చేయగలవని నివేదికలు చెప్తున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలుకావడానికి ముందు ఖర్గ్ నుంచి రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసిన ఇరాన్.. ఘర్షణలు మొదలైన తర్వాత ఈ ఎగుమతులను 4 మిలియన్ బ్యారెళ్లకు పెంచింది. యుద్ధానికి అవసరమైన నిధుల కోసమే ఇలా చేసినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఖర్గ్లో ఉత్పత్తి అవుతున్న చమురు ఎగుమతితో ఆర్థికంగా బలోపేతమవుతున్న ఇరాన్‌ను.. దీర్ఘకాలంలో దెబ్బతీయలేమని ట్రంప్ గ్రహించినట్టు వినికిడి. ఈ క్రమంలోనే ఆ ద్వీపంపై దాడులు జరిపి ఇరాన్‌ను వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం.
ఖర్గ్పై దాడులు చేస్తే ఇరాన్‌ను దెబ్బతీయవచ్చన్న విషయం నిజమైనప్పటికీ, ఈ చర్య అటు అమెరికాకు, ఇటు ఇజ్రాయెల్‌కు కొత్త ఇబ్బందులు తీసుకురావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇప్పటికే చమురు ధరలు బ్యారెల్‌కు 110-115 డాలర్లకు చేరుకొన్నాయి. ఇప్పుడు ఖర్గ్పై దాడులు జరిగితే ఈ ధరలు మరో 10 డాలర్ల మేర పెరిగే ప్రమాదమున్నది. ఖర్గ్ ద్వీపం హొర్ముజ్ జలసంధికి అతి సమీపంలో ఉంటుంది. దానిపై దాడులు జరిగితే, ఇంధన నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం జరుగొచ్చు. ఇరాన్‌పై దాడులు చేయడం వల్లే తమపై ఆ దేశం క్షిపణుల వర్షం కురిపిస్తున్నదని అమెరికా, ఇజ్రాయెల్‌పై గల్ఫ్ దేశాలు మండిపడుతున్నాయి. పశ్చిమాసియాలో కల్లోలానికి కారణమయ్యారంటూ సొంత ప్రజల నుంచే ట్రంప్, నెతన్యాహు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఇరాన్‌ను దెబ్బతీయాలని ఖర్గ్ మీద దాడికి పాల్పడితే, మొదటికే మోసం రావొచ్చని గ్రహించిన ట్రంప్ దాడుల విషయంలో తటపటాయిస్తున్నట్టు సమాచారం.