హైదరాబాద్ : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ సోషల్ మీడియా( Congress Social media) పరిస్థితి. తప్పుడు కథనాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేశారు. అయితే ముల్లును ముల్లుతోనే తీయాలనే ఎత్తుగడతో బీఆర్ఎస్ సోషల్ మీడియా రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు, అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నది.
ఇదే అదునుగా ప్రజా సమస్యలనే ఆయుధంగా చేసుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎదరుదాడికి దిగడంతో పరిస్థితి మారిపోయింది. దీంతో దెబ్బకు ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జీలు రాష్ట్ర పరిస్థితులపై ఆగమేఘాలమీద సమీక్షించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాఫిక్‌గా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్వాన్నంగా తయారైందని కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా చైర్ పర్సన్ సుప్రియ శ్రీనేట్(Supriya Sreenat) చీవాట్లు పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యులు సతీష్ మన్నె, నవీన్ పెట్టెం మీద కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా చైర్ పర్సన్ సుప్రియ శ్రీనేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించడంలో మీరిద్దరు ఫెయిల్ అయ్యారని తీవ్రంగా మందలించినట్ల సమాచారం.
ఇటీవల హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా సదస్సుకు ముఖ్య అతిథిగా సుప్రియ హాజరై మాట్లాడారు. అధికారంలో మనమే ఉన్నాం. నిధులకు కొరత లేదు, అయినా బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుతుంటే ఏం చేస్తున్నారని తలంటారు. రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీదే హవా కనపడుతుంది. మన కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడింది అని సుప్రియ అన్నట్లు తెలిసింది. సుప్రియ ప్రశ్నలతో రాష్ట్ర సోషల్ మీడియా బాధ్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.
ఇక మీవల్ల కాదు కానీ, ముఖ్యమైన కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాలు అన్నీ ఢిల్లీ నుంచి మేమే చూసుకుంటాం అని తెగేసి చెప్పిందట. దాని కోసం ఒక ఢిల్లీ ఏజెన్సీని కూడా దించబోతున్నారట. సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే ఒక యువ మహిళా కాంగ్రెస్ నేతకు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు వినికిడి!. అయితే ఇప్పటికే పరిపాలన ఢిల్లీ కనుసన్నల్లోంచి నడుస్తుంటే చివరికి సోషల్ మీడియా కూడా వారి చెప్పుచేతుల్లోనే ఉండాలా? అలాగైతే ఇక మేమెందుకు అని ఇక్కడి కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట.