Water Shortage | ఢిల్లీ (Delhi) వాసులను గాలి కాలుష్యంతోపాటు.. నీటి కొరత (Water Shortage) తీవ్ర ఇబ్బంది పెడుతోంది. నగరంలో యమునా నది (Yamuna River) కాలుష్యంతో నురగలు కక్కుతోన్న విషయం తెలిసిందే. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, మురుగునీటిని వదులుతుండటంతో యమునా నదిలో విషపూరితమైన తెల్లటి నురగ ప్రవహిస్తోంది. నదిలో అమ్మోనియా సాంద్రత ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. దీంతో పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది.
నదిలో అమ్మోనియా కంటెంట్ అధికంగా ఉన్నందున నవంబర్ 1 వరకూ తూర్పు, ఈశాన్య, దక్షిణ ఢిల్లీలో నీటి సమస్య ఉంటుందని ఢిల్లీ జల్ బోర్టు (Delhi Jal Board) తెలిపింది. ఎగువ గంగా కాలువ నిర్వహణ కోసం మూసివేయడంతో.. భాగీరథి, సోనియా విహార్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు డిమాండ్‌ను తీర్చడానికి కష్టపడుతున్నాయని పేర్కొంది. ఈ ప్లాంట్లు యమునా నదిపైనే ఆధారపడి ఉన్నాయని.. అయితే, ప్రస్తుతం యమునా నీరు కాలుష్యంతో నిండిపోవడంతో.. నీటి శుద్ధి కష్టతరంగా మారిందని వివరించింది. ఈ కారణంగా నీటి ఉత్పత్తి 30 శాతం తగ్గిందని పేర్కొంది. ఢిల్లీ వాసులు అవసరాల మేరకే నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.
కాగా, యమునా నది కాలుష్య కాసారంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల విష పూరితమైన నురగ నదీ జలాలపై పొరగా ఏర్పడటంతో అవి మరింత అధికమయ్యాయి. ఇక నదిలో కాలుష్యంపై బీజేపీ, ఆప్ పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి. యమునా నది అలా కావడానికి కారణం బీజేపీయేనని, ఆ పార్టీ పాలిత యూపీ, హర్యానాల్లోని వందలాది పరిశ్రమల్లోని శుద్ధి చేయని మిలియన్ గ్యాలన్ల పారిశ్రామిక వ్యర్థాలు డ్రైన్ల ద్వారా యమునలో కలవడం వల్లే పూర్తిగా కలుషితం అయినట్టు ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
మరోవైపు మరో వారం రోజుల్లో ఛట్ పూజ వస్తుండటంతో యమునా నదిలో కాలుష్య పరిస్థితిపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండుగ పూర్తయిన ఆరు రోజుల తర్వాత ఉత్తరాదిలో ఛట్ పూజ చేస్తారు. ఈ సందర్భంగా సమీపంలోని నదిలో స్నానమాచరించి సూర్యభగవానుడికి పూజలు నిర్వహిస్తారు. కానీ కాలుష్యం కారణంగా యమునా నది ( yamuna river ) విషపు నురగలతో ఉప్పొంగుతోంది. సరిగ్గా పండుగ సమయంలోనే ఈ పరిస్థితి రావడంతో నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కలుషిత నీటిలోనే పుణ్య స్నానాలు ఆచరించాల్సిన పరిస్థితి తలెత్తింది.
Also Read..
Air Pollution | ఢిల్లీలో అధ్వానస్థితికి గాలి నాణ్యత.. 300కి పడిపోయిన ఏక్యూఐ
Darshan | అభిమాని హత్య కేసు.. కన్నడ నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు
Nishadh Yusuf | చిత్ర పరిశ్రమలో విషాదం.. సూర్య ‘కంగువ’ సినిమా ఎడిటర్ మృతి