Air Pollution | ఢిల్లీలో గాలి నాణ్యత (Air Pollution) అధ్వాన (Very Poor) స్థితికి చేరింది. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ఏక్యూఐ 300కి పడిపోయింది. అనేక ప్రాంతాల్లో 300కి పైనే నమోదైనట్లు కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) తెలిపింది.
ఆనంద్ విహార్‌లో 351, బవానాలో 319, అశోక్ విహార్ ప్రాంతంలో 351, వాజీపూర్‌లో 327గా ఏక్యూఐ నమోదైంది. ఇక అయా నగర్లో 290, ఐటీవో వద్ద 284గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. గాలి నాణ్యత పడిపోవడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. ఇదిలా ఉండగా.. కాళింది కుంజ్‌లోని యమునా నదిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. నదిలో విషపూరితమైన నురగ తేలుతూ కనిపిస్తోంది.
ఈ మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రమవుతోంది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెడుతుండడంతో ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. దీనికి తోడు పొగమంచు కూడా రాజధాని ప్రాంతాన్ని ఆవహిస్తోంది. దీంతో నగరంలో రోజురోజుకూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) అధ్వానస్థితికి చేరుకుంటున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
Also Read..
Darshan | అభిమాని హత్య కేసు.. కన్నడ నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు
Spain Floods | స్పెయిన్‌లో మెరుపు వరదలు.. అనేక మంది మృతి.. కొట్టుకుపోయిన కార్లు
Nishadh Yusuf | చిత్ర పరిశ్రమలో విషాదం.. సూర్య ‘కంగువ’ సినిమా ఎడిటర్ మృతి