శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 02:20:38

కృశిస్తున్న కరోనా!

కృశిస్తున్న కరోనా!

  • రాష్ట్రంలో తగ్గిన వైరస్‌ వ్యాప్తి
  • ప్రతి వందమందిలో నలుగురికే పాజిటివ్‌
  • తగ్గుతున్న టీపీఆర్‌.. పెరుగుతున్న రికవరీ రేటు

వందలాది ప్రాణాలను బలిగొన్న కరోనా కృశిస్తున్నది.. వేలాది మందికి వ్యాపించిన వైరస్‌ వ్యాప్తి తగ్గుతున్నది.. లక్షలాది మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన మహమ్మారి మాయమవుతున్నది.. వును! రాష్ట్రంలో కొవిడ్‌-19 ప్రభావం తగ్గిపోతున్నది. ఒకరి నుంచి ఒకరికి సోకుతూ ముప్పుతిప్పలు పెట్టిన ఈ కర్కోటకురాలు.. ఇప్పుడు పారిపోతున్నది. తొలిరోజుల్లో కరోనా నిర్ధారణ చేస్తే ప్రతి వంద మందిలో 75 మందికి పాజిటివ్‌ రాగా, ఇప్పుడు అది నలుగురికే పరిమితమవుతున్నది. ఆశాజనకంగా పాజిటివిటీ రేటు(టీపీఆర్‌) తగ్గతుండగా, రికవరీ రేటు రికార్డు స్థాయికి చేరుకుంటున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  చైనాలో పుట్టింది.. ప్రపంచ దేశాలకు పాకింది.. భారతదేశంలోకి వచ్చింది.. ప్రజలను భయపెట్టింది.. ఎంతోమంది ప్రాణాలనూ తీసింది.. ఐదారు నెలలపాటు నరకం చూపించిన కరోనా వైరస్‌ ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. మార్చి 2న మన రాష్ట్రంలోకి వచ్చిన కరోనా ఇప్పటివరకు 1.85 లక్షల మందికి సోకింది. వైరస్‌ వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడ్డ 1,100 మంది మరణించారు. జూన్‌, జూలైలో దావానలంగా వ్యాపించిన ఈ మహమ్మారి.. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల జీవనశైలి మెరుగుదల ఫలితంగా తగ్గిపోతున్నది. జూన్‌ నెలలో పరీక్ష చేసిన ప్రతి వంద మందిలో 72 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలగా, ఆగస్టు చివరి నాటికి జరిపిన ప్రతి వంద పరీక్షల్లో 10 మందికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. అది సెప్టెంబర్‌ 26 నాటికి నలుగురికే పరిమితమైంది. భారీగా పరీక్షలు జ రుపుతున్నా.. పాజిటివ్‌ కేసులు తక్కువ నమోదవ్వ టం ఉపశమనం కలిగిస్తున్నది. మొత్తం పరీక్షల్లో ప్రతి వందకు 6.5శాతం మందికే పాజిటివ్‌ అని తేలింది.

కోలుకున్న వారే ఎక్కువ..

పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండగా, మరోవైపు కోలుకుంటున్నవారి శాతం క్రమంగా పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా ఈ రేటు 82.39 శాతం ఉంటే తెలంగాణలో మాత్రం 83.13 శాతం ఉంది. విస్తృతంగా పరీక్షలు నిర్వహించటం, అవసరమైన వారికి తక్షణం వైద్యసహాయం అందించటం, కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటుచేసి లక్షణాలు ఉన్నవారిని గుర్తించటం వల్ల రాష్ట్రంలో రికవరీ రేటు రికా ర్డు స్థాయికి చేరకున్నట్టు వైద్య నిపుణులు చెప్తుతున్నారు. ఇప్పటివరకు వైరస్‌ బారిన పడినవారిలో 1.54లక్షల మంది కోలుకోగా, 30 వేల మంది దాకా ఇంట్లో, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. నిత్యం కొత్త కేసుల కంటే, కోలుకుంటున్న వారే ఎక్కువ ఉంటున్నారు.

వ్యాప్తి తగ్గుదలకు కారణాలివే..

లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం కరోనా వ్యాప్తి పెరిగినప్పటికీ, ప్రస్తుతం అదుపులోనే ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఉద్యోగం, ఉపాధి, విద్య ఇతర కార్యకలాపాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నప్పటికీ, కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ సహా, అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. వైరస్‌వ్యాప్తి, లక్షణాలు, చికిత్సపై అవగాహన పెరుగటంతో అప్రమత్తంగా ఉంటున్నారు. వీటికితోడు పెద్ద సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేసి వైరస్‌ సోకిన వారిని తక్షణం గుర్తించడం వల్ల వ్యాప్తి జరుగకుండా అడ్డుకోవటం సాధ్యమవుతున్నది.