గద్వాల, సెప్టెంబర్ 4 : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్‌టైం ఉద్యోగులు (Part time teachers) బుధవారం నిరసన(Protest )వ్యక్తం చేశారు. తమను విధుల నుంచి అకస్మాత్తుగా ప్రభుత్వం తొలగించడంతో ఆగ్రహంతో జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పీఈటీలు ఆందోళన చేపట్టారు. కొన్నేండ్ల నుంచి రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా మేము విధులు నిర్వర్తించామని పలువురు తెలిపారు.
అలాంటి మమ్మల్ని అకస్మాత్తుగా తొలగించడంతో మా కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉందని వాపోయారు. అలాగే జూన్, జూలై, ఆగస్టు జీతాలు ఇంకా ఇవ్వలేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఇప్పటికైనా మమ్మల్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.