శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:30:57

రికార్డుల్లోనే కెనాల్‌!

రికార్డుల్లోనే కెనాల్‌!

  • తవ్వని కాలువకు పరిహారం 
  •  పరకాలలో అవినీతి బాగోతం
  •  రైతుబంధుతో వెలుగులోకి..
  • గగ్గోలు పెడుతున్న రైతులు

పరకాల: వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలో ఎస్సారెస్పీ డీబీఎం 31 కాలువ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 1980-1985 మధ్యకాలంలో ఎస్సారెస్పీ కాలువ నిర్మాణం జరిగిందని, అందుకు సంబంధించి రైతులకు పరిహారంగా డబ్బులు కూడా ఇచ్చామని అధికారులు పేర్కొంటుండగా.. మోకాపై చూస్తే అసలు కాలువే కన్పించడం లేదు. కాలువ ఉన్నట్లు చెబుతున్న భూములకు సంబంధించిన రైతుబంధు డబ్బులను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో అసలు విషయం తెలుసుకుని కంగుతిన్న రైతులు.. అప్పటి అధికారుల తప్పిదానికి తమను బలిచేస్తారా? అంటూ ఆందోళన చెందుతున్నారు.

మోకాపై కనిపించని కాలువ

పరకాల మండలంలోని పెద్దరాజిపేట నుంచి పరకాల శివారు వరకు భూముల్లో ఎస్సారెస్పీ డీబీఎం-31 కాలువ ఉన్నట్లు ఎస్సారెస్పీ అధికారుల వద్ద ఉన్న రికార్డులు స్పష్టంచేస్తున్నాయి. కానీ మోకాపై చూస్తే అసలు కాలువే లేదు. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర కాలువ నిర్మించామని, అందుకు సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చామని ఎస్సారెస్పీ అధికారులు పేర్కొంటుండగా.. తాతలు, తండ్రుల నుంచి వచ్చిన భూములనే తాము సాగుచేసుకుంటున్నామని, తమ చిన్నప్పటి నుంచి భూముల వద్దకు వెళ్తున్నామని, ఎవరూ కనీసం కాలువ కడతామని వచ్చిన దాఖలాలు లేవని రైతులు పేర్కొంటున్నారు. 1984లో ఎస్సారెస్పీ కాలువ నిర్మించిన కాంట్రాక్టర్‌ కాలువ నిర్మించకుండానే వదిలేసి.. అధికారులు, కాంట్రాక్టర్‌ కలిసి కాలువ నిర్మించినట్లు రికార్డుల్లోకెక్కించి డబ్బులు స్వాహా చేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. 

పొంతనలేని పేర్లతో పరిహారం స్వాహా..!

ఎస్సారెస్పీ కాలువ నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన రైతులకు అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. కానీ పరకాల మండలంలోని పెద్దరాజిపేట శివారు 20వ సర్వే నంబర్‌ వరకు వచ్చిన కాలువ రైతుల అడ్డగింపుతో అక్కడి వరకే ఆగింది. పెద్దరాజిపేట శివారు ముగిసి పరకాల రెవెన్యూ శివారు ప్రారంభమయ్యే సర్వే నంబర్‌ 966 వద్ద నుంచి కనిపర్తి రోడ్డు వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర కాలువ నిర్మించలేదు. అయినా నక్షలో కాలువ ఉన్నట్లు చూపుతుండగా మోకాపై మాత్రం లేదు. పొంతనలేని పేర్లను సృష్టించి కనీసం రైతుల ఇంటిపేరుతో కలిసే పేర్లు కూడా లేనివారి పేర్లను పెట్టి వారికి డబ్బులిచ్చారు. ఆ రికార్డులనే ప్రస్తుతం అధికారులు రైతులకు చూపిస్తున్నారు. రైతులు మాత్రం అధికారులు ఇచ్చిన 27 మంది జాబితాలో సర్వే నంబర్లు మాత్రమే తమవని, ఆ పేర్లెవరివో తమకు తెలియదని గగ్గోలు పెడుతున్నారు. సుమారు 35 ఏళ్ల క్రితం అధికారులు ఏం చేశారో ఏమోకానీ, తమకు ఇప్పుడు వచ్చే రైతుబంధు రావడంలేదని, బినామీ పేర్లతో డబ్బులను స్వాహా చేసి నిర్మాణం వదిలేశారని రైతులు ఆరోపిస్తున్నారు. 

1970 నుంచి భూమి మాదే

1970లో మా నాన్న పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయింది. అప్పటి నుంచి సర్వే నంబర్‌ 97లో మేమే ఉంటున్నాం. ప్రభుత్వం పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చినప్పుడల్లా మాకూ వచ్చాయి. నాకున్న భూమి నుంచి మూడెకరాల 30 గుంటల్లో కాలువ పోయిందని అంటున్నారు. ఈ భూమిలో కాలువే లేదు. మా భూమిని రికార్డుల్లోకెక్కించి రైతుబంధు చెల్లించాలి. 

- గండ్ర ప్రకాశ్‌రెడ్డి, రైతు

అప్పటి అధికారులదే మోసం

ఎస్సారెస్పీ కాలువ నిర్మాణ సమయంలో రెవెన్యూ, ఎస్సారెస్పీ అధికారులు చేసిన మాయకు మేము బలవుతున్నాం. నాకున్న రెండెకరాల ఐదు గుంటల్లో నుంచి అధికారులు ఎకరం 26 గుంటల్లో కాలువ పోయిందంటున్నారు. రెండుసార్లు పీ రామయ్య పేరు మీద డబ్బులు వచ్చాయంటున్నారు. రెవెన్యూ అధికారులేమో ఇప్పుడు పహాణీ ఇవ్వడంలేదు.  కలెక్టర్‌, అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. 

-  దగ్గు రవీందర్‌రావు, రైతు

మరోసారి పరిశీలిస్తాం

ఎస్సారెస్పీ కాలువకు భూములు పోయా యి. నిబంధనల మేరకే రైతుబంధు డబ్బులు ఆగాయి. రైతులేమో ఆ భూమిలో అసలు కాలువే లేదంటున్నారు. మరోసారి మోకాపై పరిశీలన చేస్తాం. రైతులకు న్యాయం జరిగేలా చేస్తాం. 

- జగదీశ్వర్‌, తాసిల్దార్‌ పరకాల

తాజావార్తలు


logo