MLA Kunamneni | హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు. భావ వ్యక్తీకరణపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ కోర్టుల సవరణ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
ఇవాళ సమాజంలో న్యాయ వ్యవస్థ అనేక అంశాలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రధానంగా పెండింగ్ కేసులు సంవత్సరాల తరబడి ఉన్నాయి. వాటిని ఎలా పరిష్కరించాలో చర్చ పెట్టాలి. ఏపీపీలు, గవర్నమెంట్ ప్లీడర్లు, పీపీలు చాలా తక్కువగా ఉన్నారు. దాంతో అధికంగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ మధ్యలో కొన్ని జీవోలు వచ్చాయి. పోలీసు ఉద్యోగాల కోసం జీవో 46 విషయంలో కొందరు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాయిదాలకు అటెండ్ కారు. దీంతో ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా జరుగుతంది. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇలాంటి వాటిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన పరిష్కరించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
ఇవాళ దాడులు అనేది సర్వసాధారణమైపోయాయి. భావ స్వేచ్ఛపై, ప్రజా ఉద్యమాలపై దాడులు పెరిగిపోతున్నాయి. నిన్న మొన్న మా ధర్నాలకు వెళ్లాను. మధ్యాహ్న భోజనం కార్మికులు ధర్నా చేస్తే పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఇది ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందో లేదో తెలియదు. సాధారణంగా అసెంబ్లీ నడిచినప్పుడు కార్మికులు అసెంబ్లీ ఎదుట ధర్నాకు యత్నిస్తారు. ఎందుకంటే అక్కడ ఆందోళన చేస్తే తమ సమస్యలు ప్రభుత్వానికి తెలుస్తాయని. అంతేకానీ వారు టెర్రరిస్టుల మాదిరిగా దాడులు చేయడం లేదు. బతుకు పోరాటం అది అని తెలిపారు.
తెలంగాణలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ధర్నాలకు వచ్చే వారిని దారుల్లోనే అరెస్టులు చేస్తున్నారు. ఒక వేళ సమయం ఇచ్చినా 2 గంటలే అని పరిమితి విధిస్తున్నారు. ప్రజా ఉద్యమాలను పోలీసులు అణిచివేస్తున్నారు. అదే పద్ధతుల్లో ఇంకా ఉపా, ఎన్ఐఏ లాంటి సంస్థలను యథేచ్చగా ఉపయోగిస్తున్నారు. నిన్న హరగోపాల్ నాతో మాట్లాడుతూ సుందరయ్య విజ్ఞాన భవనంలో సహజంగా పుస్తకావిష్కరణ, సమావేశాలు పెట్టుకుంటాం. పోలీసు అనుమతి కావాలని గత ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పుడు మాత్రం అలాంటి భవనాల్లో మీటింగ్లు పెట్టాలంటే పోలీసుల అనుమతి కావాలని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతికా స్వేచ్ఛపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా అరెస్టులు చేసి లోపల పడేస్తున్నారని కూనంనేని తెలిపారు.
ఈ మధ్యలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మూడు క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలను ఏ మేరకు సవరణ చేయొచ్చో ఆలోచించాలి. ఎందుకంటే సీజేఐగా జస్టిస్ రమణ ఉన్నప్పుడు ఆయన రాజద్రోహం అనే సెక్షన్ తీసేయమని చెప్పారు. రాజద్రోహం తీసేశారు కానీ దేశద్రోహం అని పెట్టారు. సమ్మెలు చేసే వారిని దేశద్రోహం, టెర్రరిస్టుల పేరుతో అరెస్టు చేసేలా నిబంధనలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న మన దేశస్తులు ప్రజా సమస్యలపై ప్రకటనలు చేసినా కేసులు పెట్టేలా సెక్షన్లు ఉన్నాయి. కేంద్రం తెచ్చిన చట్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | అసెంబ్లీలో మేం ఎలాంటి వీడియోలు తీయలేదు.. సభకు తెలిపిన కేటీఆర్
KTR | తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు.. స్వాగతిస్తున్నామన్న కేటీఆర్
KTR | ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే.. అంత అన్యాయం జరిగినట్లే : ఎమ్మెల్యే కేటీఆర్