KTR | హైదరాబాద్ : నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని గత ప్రభుత్వంలో కేసీఆర్ నిర్ణయించారని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గుర్తు చేశారు. పదేండ్ల పాట విభజన జరగలేదు కాబట్టి ఆ పేరు పెట్టలేకపోయాం.. ఇప్పుడు విభజన జరిగిపోయింది కాబట్టి.. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే స్వాగతిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టేందుకు ఎలాంటి భేషజాలు తమకు లేవు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సభలో ఉన్న ఇతర సభ్యులు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఈ విధంగా స్పందించారు.
సురవరం ప్రతాప్ రెడ్డి అంటే కేసీఆర్‌కు ఎనలేని గౌరవం ఉంది కాబట్టి తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నాం. పదేండ్ల పాట విభజన జరగలేదు కాబట్టి ఆ పేరు పెట్టలేకపోయాం.. ఇప్పుడు విభజన జరిగిపోయింది కాబట్టి.. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే స్వాగతిస్తాం. సురవరం మీద ఉన్న గౌరవంతో 394 మంది కవులతో గోలకొండ కవుల సంచిక తెచ్చాం. తెలంగాణలోని మహానుభావులైన కాకా విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ మీద నెలకొల్పాం. ఈశ్వరీభాయి జయంతిని నిర్వహించాం. కాళోజీ పేరు మీద హెల్త్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు పేరు మీద వెటర్నరీ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద హార్టికల్చర్ వర్సిటీ, జయశంకర్ సర్ పేరు మీద అగ్రికల్చర్ యూనివర్సిటీ, బాబు జగ్జీవన్ పేరును సిరిసిల్లలో వ్యవసాయ కాలేజీకి నామకరణం చేశాం. బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్(ప్రెస్ క్లబ్)లో రూ. 5 కోట్లతో సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మీద ఉన్న ఆడిటోరియాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దాం. మహానుభావులను రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి తెలంగాణలో ఉంది.. ఆ ఒరవడిని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. స్పోర్ట్ పాలసీని కూడా స్వాగతిస్తాం. ప్రతి గ్రామంలో తెలంగాణ గ్రామీణా క్రీడా ప్రాంగణం నిర్మాణం చేశాం. వీటిని కూడా బాగు చేసి వినియోగంలోకి తేవాలని కోరుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | విద్యారంగంలో సమస్యలు పరిష్కరించండి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ
KTR | వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కాకుండా మరోచోట హైకోర్టు భవనం కట్టండి : కేటీఆర్
Nizamabad | రుణమాఫీ కాలేదని అన్నదాతల్లో ఆందోళన.. బ్యాంకుల ఎదుట ఆందోళనలు