హైదరాబాద్: తెలంగాణ విద్యారంగానికి సంబంధించి ఇచ్చిన హామీలు, వెంటనే పరిష్కరించవలసిన సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao), ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బహిరంగలేఖ రాశారు. విద్యారంగ ప్రయోజనాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అందులో వివరించారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడానికి ముందే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్పష్టమైన విధానపర నిర్ణయాలు వెలువరించి, ఆదేశాలు జారీచేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని అందులో పేర్కొన్నారు.
లేఖ సారాశం..
పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో మీరు ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు అభినందనలు. కానీ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తమవి అని చెప్పుకుంటున్న కొన్ని అంశాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు కావడంతో నిజాలు తెలియజేయలనే ఉద్దేశంతోనూ, అదే విధంగా అమలు చేయవలసిన మీ హామీలతోపాటు వెంటనే పరిష్కరించవలసిన సమస్యలను గుర్తుచేయడానికి, విద్యారంగ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ లేఖ రాస్తున్నాం.
నేడు వేలాది మంది ఉపాధ్యాయులతో తాము నిర్వహిస్తున్న ముఖాముఖిలో మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన కింది హామీలపై స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు వెలువరించి ఆదేశాలు ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నది.