Party Defected MLAs | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఊహించినట్టుగానే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బీ ఫారమ్‌పై గెలుపొంది, కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీర్పు ఇచ్చారు.
ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ ఇచ్చిన స్పీకర్, బుధవారం మిగతా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి సైతం క్లీన్చిట్ ఇచ్చారు. వారు ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారంటూ, వారిపై దాఖలైన ఫిర్యాదులను కొట్టివేశారు. దీంతో ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. పార్టీ ఫిరాయించిన పది మందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా, లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫారం కూడా తీసుకున్నారు.
ఇప్పటికీ కేంద్ర ఎన్నికల వెబ్సైట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీచేసి, ఓడిపోయారని ఉన్నది. కానీ, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మాత్రం సరైన ఆధారాలు దొరకలేదా? అంటూ మండిపడుతున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని అనేక బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో ఆయన కాంగ్రెస్ వేదికలెక్కి ప్రసంగించారు. ఏఐసీసీ, సీఎల్పీ సమావేశాల్లో సైతం పాల్గొన్నారు. తన కూతురుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ లోక్‌సభ సీటు ఇప్పించుకొని, గెలిపించుకున్నారు. ఇన్ని చేసినా ఆయన కాంగ్రెస్‌లో చేరినట్టు స్పీకర్‌కు నమ్మకం కుదరడం లేదా? అని ప్రజాస్వామికవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తారని, మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనే ఇలాంటి తీర్పు వెలువడటం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడంపై న్యాయసమీక్ష కోరాలని బీఆర్ఎస్ యోచిస్తున్నది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నది. స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా ఉన్నదని బీఆర్ఎస్ భావిస్తున్నది. పదిమందిపై స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో విచారణ జరిపారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు న్యాయసమీక్షకు లోబడే ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేయాలని, హైకోర్టులో న్యాయసమీక్షకు పిటిషన్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయనిపుణులతో పార్టీ అధిష్ఠానం చర్చలు జరుపుతున్నది. దేశంలో ఇప్పటి వరకు ఏయే రాష్ర్టాల్లో ఈ విధంగా న్యాయ సమీక్ష చేశారు? హైకోర్టులో కేసు ఎలా నడపాలన్న దానిపై స్పష్టమైన ఆలోచనతో పార్టీ ఉన్నట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శిక్షపడాలని, వారి సభ్యత్వాలు రద్దయ్యేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. దేశంలోని అగ్రశ్రేణి న్యాయనిపుణులతో పార్టీ న్యాయవిభాగం ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టిందని సమాచారం.

స్పీకర్ మొత్తం పది మంది ఎమ్మెల్యేల అనర్హత అంశంపై విచారణను పూర్తిచేశారు. దీంట్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తవ్వడంతోపాటు స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించి సుదీర్ఘకాలమైంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ బుధవారం పూర్తిచేశారు. అయితే, ఇప్పటికే విచారణ పూర్తయిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావుకు సంబంధించిన అయిదు కాపీలను మాత్రమే ఇప్పటివరకు స్పీకర్ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీకి అందజేసింది. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి విచారణ గత సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన పూర్తయ్యింది.
జనవరి 15న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అనర్హత పిటిషన్లపై తన నిర్ణయాన్ని ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేస్తూ వీరు సభ్యులుగా కొనసాగుతారని చెప్పారు. ఫిబ్రవరి నాలుగో తేదీన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను కొట్టివేస్తూ స్పీకర్ తీర్పు ఇచ్చారు. అయితే, వీరికి సంబంధించిన స్పీకర్ జడ్జిమెంట్‌కు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను స్పీకర్ కార్యాలయం ఇంకా ఇవ్వలేదు. జనవరిలో విచారణ ముగిసినవారికి సంబంధించిన జడ్జిమెంట్ కాపీలను అధికారికంగా ఇచ్చేందుకు కూడా స్పీకర్ కార్యాలయం సిద్ధంగా లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో కాలయాపన చేశారని, ఇప్పుడు విచారణ పూర్తయిన తర్వాత సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు నెలల తరబడి సమయం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.