Shivani Nagaram | తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తలెత్తిన వివాదంపై టాలీవుడ్ యువ నటి శివాని నాగరం (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఫేమ్) తాజాగా స్పందించింది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీయడంతో ఆమె ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.
అసలు వివాదం ఏమిటంటే?
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో శివాని మాట్లాడుతూ.. తన సినిమా సక్సెస్ తర్వాత తిరుమల వెళ్లానని, అక్కడ తనకు 15 నిమిషాల పాటు స్వామివారి దర్శనం కలిగిందని చెప్పారు. సాధారణ భక్తులకు కనీసం సెకన్ల పాటు కూడా దర్శనం దొరకని చోట, ఒక హీరోయిన్‌కు 15 నిమిషాల సమయం ఎలా ఇస్తారని నెటిజన్లు, భక్తులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. సెలబ్రిటీలకు టీటీడీ (TTD) ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వివాదంపై తాజాగా స్పందించింది శివాని నాగరం.
తాను ఏ ప్రోటోకాల్ లేదా సెలబ్రిటీ కోటాలో వెళ్లలేదని తెలిపిన శివాని అక్టోబర్ 2025లో తన తల్లితో కలిసి ఎయిర్‌పోర్టులోనే రూ. 10,500 శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లు తీసుకున్నానని తెలిపారు. దీనికి సంబంధించిన టికెట్ ఆధారాలను కూడా ఆమె చూపించారు. 15 నిమిషాల దర్శనం అంటే గర్భాలయంలో స్వామివారి ముందే అన్ని నిమిషాలు నిలబడ్డానని కాదు. క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు స్వామివారు దూరం నుండి కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటారు. ఆ ప్రారంభం నుండి గర్భాలయం దాటి బయటకు వచ్చే వరకు పట్టిన మొత్తం సమయాన్ని నేను అంచనాగా 15 నిమిషాలు అని చెప్పాను అని వివరించారు. తన ఆనందాన్ని పంచుకునే క్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని, గర్భాలయంలో తనను ఎవరూ ప్రత్యేకంగా ఎక్కువ సేపు నిలబెట్టలేదని ఆమె స్పష్టం చేశారు. శ్రీవాణి టికెట్ తీసుకునే ఎవరికైనా స్వామివారిని దగ్గరగా, ప్రశాంతంగా చూసుకునే అవకాశం ఉంటుందని. ఆలయ అధికారులు నాకు ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వలేదని శివాని చెప్పుకోచ్చింది.