హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ (పీఆర్ఆర్డీ) మంత్రి సీతక అధికారులను ఆదేశించారు. శుక్రవారం నుంచి ఈ నెల 15 వరకు పరిశుభ్రత కార్యక్రమాలు, 16 నుంచి 31 వరకు ఆదాయ పెంపుదల మార్గాల కార్యక్రమం చేపట్టాలని, ఏప్రిల్ 1 నుంచి 15 వరకు తాగునీటిపై, 16 నుంచి 30 వరకు ఇండ్లు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి వెలువడే చెత్తసేకరణ కార్యక్రమాలు, మే 1 నుంచి 15 వరకు ఉపాధి హామీ పనులు, 16 నుంచి 31 వరకు వానకాలం సంసిద్ధానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గురువారం ఆమె జిల్లా సీఈవోలు, డీపీవోలు, డీఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.