హైదరాబాద్, మార్చి5 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ బీసీలకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆ పార్టీపై బీసీలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని బీసీలకు కేటాయించాలని, మరొకటి ఎస్సీ, ఎస్టీలలో ఒకరికి కేటాయించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. రాష్ర్టేతరులకు, అగ్రకులాలకు ప్రాతినిధ్యం కల్పించవద్దని మొదటి నుంచి కాంగ్రెస్ అధిష్ఠానానికి బీసీ, కుల సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయినా కులసంఘాల విజ్ఞప్తిని కాంగ్రెస్ అధిష్ఠానం తుంగలో తొక్కింది. ఆ 2 రాజ్యసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డికి ఖరారు చేసింది. దీంతో ఆ పార్టీ తీరుపై కులసంఘాలు మండిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని బీసీ సంఘాల నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 2 ఎమ్మెల్యే టిక్కెట్ల చొప్పున ఇవ్వకుండా తొలుత మోసం చేసిందని గుర్తుచేస్తున్నారు.
అన్ని పదవుల్లో అన్యాయం
అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవుల్లో, నామినెటెడ్ పదవుల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇవ్వలేదని ఆక్షేపిస్తున్నారు. డిక్లరేషన్లలో బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని చెప్తున్నారు. రుణాలు ఇవ్వలేదని, ఫెడరేషన్లకు చైర్మన్లను నియమించ లేదని, అడిషినల్ కలెక్టర్, ఆర్డీవో తదితర ముఖ్యమైన పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, బీసీ విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించడం లేదని నిప్పులు చెరుగుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి నయవంచనకు గురిచేసిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కుల సర్వేలు, నివేదికలు, అసెంబ్లీ బిల్లులు, జీవోలు, ఆర్డినెన్స్‌ల పేరిట నమ్మబలికి నట్టేట ముంచిందని మండిపడుతున్నారు. తాజాగా రాజ్యసభ స్థానాల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం అన్యాయమని, బీసీలకు ద్రోహం చేసిన పార్టీకి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.