Typhoon Noul : చైనా (China) లోని పలు ప్రాంతాల్లో భారీ నౌల్ తుఫాను (Typhoon Noul) బీభత్సం సృష్టిస్తోంది. చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ (Red Alert) ప్రకటించింది. ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంవల్ల దక్షిణ చైనా (South China) లో తీవ్ర స్థాయిలో గాలులు, భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రభావం ఎక్కువగా ఉన్న గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ (Guangdong) లో మూడు లక్షలకుపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. శనివారం 410కి పైగా విమానాలు 150 హై-స్పీడ్ రైలు సర్వీసులను రద్దు చేశారు. దాంతో వేలమంది ప్రయాణికులపై ప్రభావం పడింది. పొరుగున ఉన్న హాంకాంగ్‌పైనా ఇది విరుచుకుపడి విధ్వంసం సృష్టిస్తోంది. ఈ తుఫాను గంటకు సుమారు 145 కిలోమీటర్ల (90 మైళ్ల) గరిష్ట వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. ఫలితంగా పెద్దఎత్తున చెట్లు కూలిపోయాయి.
గ్వాంగ్డాంగ్ తీరాన్ని తాకడానికి ముందు ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకిన తర్వాత ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి.. క్రమంగా బలహీనపడుతుందని పేర్కొన్నది. దాంతో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశ రాజధాని బీజింగ్‌తో సహా అనేక ప్రధాన నగరాల్లో ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి 28 అత్యవసర సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను కారణంగా తూర్పు తైవాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.