హైదరాబాద్ : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. బతుకమ్మ పండుగ సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణకు చెందిన మహనీయులను, వైతాళికులను, కవులను, కళాకారులను, సాహితీవేత్తలను, పోరాటయోధులను గౌరవిస్తూ, వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బతుకమ్మ వేడుకలు ప్రధాన పాత్ర పోషించాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు చేపట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ నేతృత్వంలో ప్రతాని రంగమ్మ పాడిన ఆల్బమ్ నుంచి ఈ పాటను సేకరించారు. ఈ అరుదైన పాటను ప్రముఖ గాయని మధుప్రియ పాడగా, రాజ్ కిరణ్ సంగీతం అందించారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్, కన్నం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.