బుధవారం 03 జూన్ 2020
Telangana - May 03, 2020 , 18:24:36

ఉపాధిహామీ పథకం ద్వారా పేదలను ఆదుకోవాలి

 ఉపాధిహామీ పథకం ద్వారా పేదలను ఆదుకోవాలి

నిజామాబాద్:  కరోనా కష్ట కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కరువుచాయలున్న నేపథ్యంలో ఉపాధిహామీ పథకం ద్వారా పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.  ఉపాధిహామీ పనుల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీలకు గాను 529 గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమయ్యాయని, 2.4 లక్షల మందికి జాబ్‌కార్డులు ఉన్నాయన్నారు. ఇందులో 73శాతం 1.21లక్షల మంది జాబ్‌కార్డు కలిగిన కూలీలు పనిచేస్తున్నారని, ఈసారి సీజన్‌లో 86వేల మంది కూలీలు పనిచేస్తున్నారని తెలిపారు. 

అయితే కూలీల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అనివార్యత పై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. 1.30 లక్షల మందికి ఈ సీజన్‌లో ఉపాధి పనులు లభించాలని ఆ దిశగా వెంటనే కార్యాచరణ సిద్ధం చేసి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సీ నారాయణరెడ్డిని మంత్రి ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఉపాధి పనులు పేదలను ఆదుకుంటాయని, ఇదే సమయంలో  గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సిన పనులను ఉపాధిహామీ పనుల ద్వారా చేయించాలని, దీనికో ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. 

తాను నిర్దేశించిన 1.30 లక్షల మంది కూలీలకు ఉపాధి ఇవ్వడమే అధికారుల లక్ష్యమని, అదే వారి పనితీరుకు కొలమానం కానుందని ఆదేశించారు. యాక్టివ్ జాబ్‌కార్డులు కలిగిన ఉన్న ప్రతీ ఒక్కరికి పని కల్పించాల్సిందేనని ఆ మేరకు అవకాశాలు కల్పించడంతో వారిలో అవగాహన పెంచాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి, డీఆర్‌డీవో రమేశ్ రాథోడ్, జడ్పీ సీఈవో గోవింద్, అడిషనల్ పీడీ శ్రీనివాస్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


logo