గురువారం 02 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 01:46:59

మీరు రైతులను పట్టించుకున్నారా?

మీరు రైతులను పట్టించుకున్నారా?

  • ఎప్పుడైనా మార్కెట్లకు వచ్చారా..
  • దేనికోసం ప్రాజెక్టుల సందర్శనలు..
  • కాంగ్రెస్‌ నాయకులపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు రైతులను పట్టించుకోలేదు..ఆ పార్టీ నాయకులు ఎప్పుడైనా మార్కెట్లకు వచ్చారా?.. అధికారంలో ఉండగా ఏం ఉద్ధరించారని ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శన చేపట్టారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. రైతుల కోసం కృషి చేస్తున్నది ఒక్క టీఆర్‌ఎస్సేననీ, వారి సంక్షేమం కోసం ఏటా రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని ఆయన స్పష్టంచేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లాకేంద్రంలో సంగారెడ్డి గణపతి చక్కెర పరిశ్రమ చెరుకు అభివృద్దిమండలి, సదాశివపేట మార్కె ట్‌ కమిటీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హాజరయ్యారు. 

అంతకుముందు జెడ్పీ నూతన భవనాన్ని ప్రారంభించి, జెడ్పీ సమావేశంలో పాల్గొన్నారు. ఆయా కార్యాక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలతోనే గోదాములు పట్టనంత ధాన్యం తో నిండిపోయాయని, మరో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాములు నిర్మిచాలని సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారన్నారు. ప్రభుత్వ విజయాలను చూడడానికి వస్తే కాంగ్రెస్‌ను అభినందిస్తాం.. కానీ, జరిగిన పనిని కూడా జరగనట్లు చూపే ప్రయత్నాలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటారని విమర్శించారు. ఉచితవిద్యుత్‌, రైతు బీమా, రైతుబంధు, రుణమాఫీ, రైతు వేదికల నిర్మాణం వాస్తవాలు కావా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 

ప్రాజెక్టులను దేనికి సందర్శిస్తారు..? మిడ్‌మానేరును ఎనిమిదేండ్లలో మీరు సగం చేస్తే మూడేండ్లలోనే తాము పూర్తిచేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ గోదావరి జలాలతో కళకళలాడుతున్నాయని చెప్పా రు. ఆ ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పసుపు, కుంకుమ, రూపాయి బిల్ల వేసి పాపాలు కడుక్కోవాలని కాంగ్రెస్‌ నాయకులకు మంత్రి సూచించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజు శ్రీ, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్‌, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


logo