హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : కష్టపడ్డప్పుడే కలలు సాకారమవుతాయని, ఇందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితమే నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. రాజకీయాల్లో చిన్న వయసుగా పరిగణించే నాలుగు పదుల వయసులో పదవులను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం మొదలుపెట్టిన రోజు అనేకమంది కేసీఆర్ను అవహేళన చేశారని గుర్తుచేశారు. 14 ఏండ్ల నిరంతర పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పుడు సమాజంలోని ప్రతిఒకరూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారని తెలిపారు. తెలంగాణను సాధించిన కేసీఆర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని లక్ష్యాలను అందుకోవాలని విద్యార్థులకు సూచించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ మంగళవారం టెక్సాస్లోని డాలస్ విశ్వవిద్యాలయ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతోపాటు పలు అంశాల్లో సూచనలు చేశారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వచ్చిన తెలుగు విద్యార్థులు, అవగాహన లేక ఏవైనా తప్పుచేస్తే వారికి బీఆర్ఎస్ అమెరికా విభాగం తరఫున అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
కేవలం ర్యాంకులు, గ్రేడ్ల కోసం కాకుండా జీవితంలో సాధించాల్సిన ప్రధాన లక్ష్యాలపై విద్యార్థులు దృష్టి పెట్టాలి. లక్ష్యం వైపు సాగే క్రమంలో అవరోధాలు ఎదురైనా, మనతోనే ఉన్న వ్యక్తులు వెనకి లాగినా నిబద్ధతతో ముందుకు పోవాలి. ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సమాజం, ప్రపంచంలో మంచి మార్పు తెచ్చే దిశగా ప్రయత్నం చేయాలి.
-కేటీఆర్
అమెరికా పోవాలన్నా, చదువుకోవాలన్నా గతంలో ఎన్నో వ్యయ, ప్రయాసలకు గురయ్యే వాళ్లమని, ప్రపంచం వేగంగా మారిపోయి ఇప్పుడు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ చెప్పారు. అమెరికా విద్య కూడా అనేక మందికి అందుబాటులోకి వచ్చిందని తెలిపారు . విద్యార్థులు అమెరికా చట్టాలను, అక్కడి సమాజంలో మార్పులను అర్థం చేసుకొని మసలుకోవాలని సూచించారు. చూస్తుండగానే మనిషి జీవితంలో 50 ఏండ్లు పూర్తవుతాయని, ఇంత స్వల్ప కాలంలోనే తమ కలలు, ఆకాంక్షలను అందిపుచ్చుకోవాలని చెప్పారు.
మేధో వలస మన దేశానికి పెను సవాలుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆవిషరణలు వస్తున్నా.. ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో ఇండియా పోటీపడి రాణించాల్సిన అవసరం ఉన్నది. అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కొత్త ఆవిషరణలపై దృష్టిసారించాలి. మనదేశంలో ఉన్న అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలి.
మేధో వలస మన దేశానికి పెను సవాలుగా మారిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆవిషరణలు వస్తున్నాయన్న కేటీఆర్.. ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో ఇం డియా పోటీపడి రాణించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కొత్త ఆవిషరణలపై దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. అమెరికాలో చదువుకొని ఇండియాకి తిరిగి వచ్చి కంపెనీలు ప్రారంభించాలని కోరారు. మనదేశంలో ఎన్నో సవాళ్లు ఉన్నా అపారమైన అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు. దేశం, తెలంగాణ అభివృద్ధిలో విదేశాల్లో చదువుకుంటున్న యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
Also Read :