భారత దేశంలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోండి.. దేశంలోని యువత మీలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఐటీ, అనుబంధ పాలసీలతో తొమ్మిదేండ్ల లోనే ఐటీకి హైదరాబాద్ ల్యాండ్ మార్క్‌లా మారింది.
-కేటీఆర్
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : భారతదేశంలోని యువత మీలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నది.. సొంత దేశంలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోండి.. అని అమెరికాలోని ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ, అనుబంధ పాలసీలతోనే తొమ్మిదేండ్లలో ఐటీకి హైదరాబాద్ ల్యాండ్మార్ అయిందని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన డాలస్ నగరంలో అక్కడి ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీరంగ అభివృద్ధి కోసం ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్లో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన విధానాలతోనే చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమ ఎదిగిందని వివరించారు. కృత్రిమ మేధ (ఏఐ)తో భవిష్యత్తులో లాభమే జరుగుతుందని భరోసా ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత అమెరికాలో ఉన్న భారతీయుల్లో ఆందోళన నెలకొన్నదని.. కొత్త పాలసీలు వచ్చినప్పుడు సాధారణంగా టెన్షన్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. అమెరికాలో ప్రస్తుత పరిస్థితుల కారణంగా మన దేశంలోని ఐటీ రంగంలో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వాలు, ఐటీ కంపెనీలు కలిసి పనిచేస్తేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మనదేశ యువత పోటీ పడగలుగుతుందని తెలిపారు. చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలు ఇండియాలో ఆఫ్ షోర్ సెంటర్లను ఏర్పాటుచేసే అవకాశం ఉన్నదని స్పష్టంచేశారు. మూడేండ్లలో తిరిగి అధికారంలో వచ్చిన అనంతరం ఐటీ పరిశ్రమను మరింత విస్తృతంగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
2014లో హైదరాబాద్‌లో కేవలం 3,23,000 ఐటీ ఉద్యోగాలు మాత్రమే ఉంటే.. తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి ఆ సంఖ్య 10 లక్షలకు చేరిందని కేటీఆర్ వివరించారు. తమ ప్రభుత్వ చొరవతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో టెక్ కంపెనీలు అమెరికా ఆవల తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పాయని చెప్పారు.
కేటీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన లేనిలోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుందని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి మందగించిందని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పాలనలో తొమ్మిదేండ్లపాటు ఐటీ రంగానికి చేసిన అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రశంసించారు. హైదరాబాద్‌పైనే కాకుం డా ఇతర ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీని విస్తరింపజేసి చిన్న, మధ్యతరహా కంపెనీలకు భారతదేశంలో కార్యకలాపాల నిర్వహణ లాభసాటిగా మార్చవచ్చని నిరూపించారని చెప్పారు.
Also Read :