హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్‌హెచ్‌ఎస్)గా మారుస్తూ రాష్ట్ర క్యాబినెట్ సోమవారం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించే ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ద్వారా జీతభత్యాలు పొందుతున్న టీవీవీపీ ఉద్యోగులు తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏండ్లుగా పోరాటాలు చేస్తున్నారు.
దీంతో బీఆర్ఎస్ హయాంలో నాటి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో టీవీవీపీని డీఎస్హెచ్ఎస్గా మార్చే ప్రక్రియను తుది దశకు తీసుకొచ్చారు. 2023 సెప్టెంబర్ 22న ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థగా ఉన్న టీవీవీపీని ప్రభుత్వంలోకి తీసుకొని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చాలని కమిటీ స్పష్టంచేసింది. దీంతో టీవీవీపీని డీసీహెచ్ఎస్గా మారుస్తూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. దీనిపై టీజీజీడీఏ సహా పలు సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి.