శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోడానికి సులువైన మార్గం శ్రీ సూక్తం. ఈ మాసంలో అమ్మవారిని శ్రీ సూక్తంతో ఆరాధించడం ప్రధానంగా కనిపిస్తుంది.
శ్రీ సూక్తం ఎంతో మహిమాన్వితమైనది. ఐశ్వర్య ప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందడానికి శ్రావణంలో శ్రీ సూక్త పారాయణం చేయడమే ఉత్తమమైన మార్గమని మహర్షుల మాట. నిత్యపూజా క్రియల్లో, శుభకార్య నిర్వహణలో ఈ సూక్త పఠనానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. శ్రీ సూక్తంలోని మంత్రాలన్నీ విలువైనవి. శ్రీ అనే పదాన్ని సాధారణంగా సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తాం. సంపద అంటే కేవలం డబ్బు కాదు.. ప్రకృతి సమృద్ధి, ఆహారం, జీవనశక్తి, సామాజిక గౌరవం కూడా సంపదలో భాగమే. శ్రీ శక్తిని ఆరాధించే ఈ మంత్రభాగం రుగ్వేదంలో కనిపిస్తుంది. పంచభూతాలను సమన్వయపరిచి జీవరాశికి ప్రాణశక్తిని కలిగించే అమ్మవారు ధనధాన్యాలతో పాటు బిల్వ వృక్షాల్లో నివాసం ఉంటుందని శ్రీ సూక్తం చెబుతుంది.
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్.. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ శ్రీ సూక్తంలో తొలి మంత్రమిది. జాతవేదః అంటే యజ్ఞానికి ముఖ్యదేవత అయిన అగ్ని. శ్రీమహాలక్ష్మిని నేరుగా కాకుండా అగ్ని ద్వారా ఆహ్వానించడం యజ్ఞ సంప్రదాయంతో శ్రీ సూక్తానికి ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. అగ్ని ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానించడం ఈ సూక్తంలో ప్రధానంగా కనిపిస్తుంది. అంతేకాకుండా సంపదకు చిహ్నాలైన పద్మం, ఏనుగులు, బంగారుకాంతి, చంద్రకాంతి, ధాన్యం, గుర్రాలు, పశువులు లాంటి ప్రతీకలు శ్రీ సూక్తంలో వస్తాయి. ఈ సూక్తంలోని భావజాలాన్ని సమగ్రంగా పరిశీలించినప్పుడు సంపద అనే భావన ధనంతో మాత్రమే పరిమితం కాదని తెలుస్తుంది. అలక్ష్మీర్నాశయామ్యహం అంటూ శ్రీ సూక్తంలో అలక్ష్మి, దారిద్య్రం, లోపం, అశుభం తొలగిపోవాలని మరొక మంత్రం చెబుతుంది. ఒక మంత్రంలో జ్యేష్ఠాదేవిని మన దగ్గరికి రానీయకుండా చేయమని ప్రార్థన ఉంటుంది. దారిద్య్రం అనగానే కేవలం ధనం లేకపోవడమే అనే భావన కాదు. మానవుడి ఆలోచనలు ఉన్నతంగా లేనప్పుడు భావదారిద్య్రం ఏర్పడుతుంది. అమంగళకరమైన ఆటంకాలన్నీ తొలగించి హృదయాంతరాళంలో ఉన్న అజ్ఞానమనే మాయను మటుమాయం చేయమని అమ్మవారిని ప్రార్థించడం శ్రీ సూక్తంలో కనిపిస్తుంది. జ్ఞానమే నిజమైన సంపద అని పలుచోట్ల ఈ సూక్తం చెబుతుంది.
శ్రీ సూక్తం భారతీయ వైదిక సంప్రదాయంలో లక్ష్మి తత్వాన్ని ప్రతిపాదించే ముఖ్యమైన సూక్తంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో 15 విభిన్న మంత్రాలు ఉన్నాయి. ప్రతీ మంత్రం వేర్వేరు ఛందస్సుల్లో కనిపిస్తుంది. వాటిని వేర్వేరు రుషులు పేర్కొన్నారు. ఈ వేదమంత్రాల్లో అక్షరాలకే కాకుండా స్వర, మాత్ర, ఉచ్చారణలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పుత్రులను, పౌత్రులను, వాహనాదులను ఇవ్వమని, ఆయుష్మంతులుగా చేయమంటూ సూర్యునిలోని తేజస్సు, చంద్రునిలోని ప్రకాశమూ రెండూ కలిపి విరాజిల్లు శ్రీమహాలక్ష్మిని ఉపాసిస్తున్నట్లుగా శ్రీ సూక్తంలో ఉంటుంది. శ్రీకి ప్రకృతితో బలమైన సంబంధం ఉంది. మహాలక్ష్మి కృపతోనే వర్షాలు కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. సౌభాగ్యం చేకూరుతుంది. శ్రీ సూక్తంలోని శ్రీని కేవలం ధనసంపదగా కాకుండా నీరు, భూమి, ఆహారం, పశుసంపద, ప్రకృతి, శక్తి, మానవ శ్రేయస్సు, సామాజిక సమృద్ధి లాంటి పరస్పర సంబంధిత అంశాలతో కూడిన సమగ్ర జీవన సంపదగా పరిశీలించాలి. ఇందులో హిరణ్యవర్ణం, పద్మం, జలం, కర్దమం, అన్నం, పశుసంపద, కీర్తి, ఆకలి-దాహం నివారణ లాంటి అనేక ప్రతీకలు, భావనలు కనిపిస్తాయి.
శ్రీ సూక్తాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసినప్పుడు అందులోని మంత్రాలు ఆధునిక పర్యావరణ శాస్త్రం, వ్యవసాయం, పోషకాహారం, జీవశాస్త్రం, శక్తి అధ్యయనం, న్యూరోసైన్స్ లాంటి రంగాలతో తులనాత్మక భావనలు కలిగి ఉన్నట్లు పలు పరిశోధనలు నిరూపించాయి. శ్రీ సూక్త పారాయణంలో 8 శాస్త్రీయ కోణాలు కనిపిస్తాయి. సూక్తంలోని 10 నుంచి 14 మంత్రాల్లో నీరు, మట్టి, పుష్కరిణి లేదా పద్మం, అన్నం, పశువులు, గోవులు, అశ్వాలు, సూర్యచంద్ర ప్రతీకలు, అగ్ని వంటి వాటితో పాటు మంత్రపఠనం అనేది గమనించవచ్చు. ఆపః అంటే నీరు సమృద్ధికి పునాది. ఆధునిక పర్యావరణ శాస్త్రంలో నీరు లేకుండా జీవం లేదు. సారవంతమైన భూమి లేకుండా వ్యవసాయం లేదు. వ్యవసాయం లేకుండా ఆహారభద్రత లేదు. ఆహారం లేకుండా ఆరోగ్యం లేదు. పశుసంపద, ప్రకృతి వనరులు లేకుండా సంప్రదాయ సమాజ ఆర్థిక వ్యవస్థ పూర్తి కాదు. ఈ పరస్పర సంబంధాన్ని ఆధునిక పర్యావరణ శాస్త్రం ఎకోసిస్టమ్ ఇండిపెండెన్స్గా వివరిస్తుంది.
శ్రీ సూక్తంలోని కర్దమ అనే పదం భూమికి సంబంధించినదిగా సారవంతమైన మట్టిని సూచిస్తుంది. కర్దమ (మట్టి) కేవలం ధూళిగా కాకుండా సాయిల్ సైన్స్ ప్రకారం మట్టి ఖనిజాలు, నీరు, సేంద్రియ పదార్థం, గాలి, సూక్ష్మజీవులన్నీ కలిపిన సంక్లిష్ట భౌతిక వ్యవస్థ. సారవంతమైన మట్టి నుంచి పంట వస్తుంది. తద్వారా ఆహారం లభిస్తుంది. ఇది ఆధునిక న్యూట్రిషన్ సైన్స్‌లో భాగంగా ఆహారం శక్తిని కలిగిస్తూ జీవనాధారంగా ఉంటుంది. ఈ సూక్తంలో మరొక ముఖ్యమైనది పద్మం. పంకజాసీనగా మహాలక్ష్మిని పూజిస్తాం. పద్మం సహజంగా జలపరిసరాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఆధునిక ఎకాలజీలో పద్మాలు నీటిని నిల్వచేసి, అనేక జీవులకు ఆవాసం కల్పిస్తాయని చెబుతారు. అంతేకాకుండా ఇవి వరద నియంత్రణలో సహాయపడటంతో పాటు జీవవైవిధ్యాన్ని కాపాడుతాయి.
శ్రీ సూక్తంలో క్షుత్పిపాస వంటి భావనలు కనిపిస్తాయి. ఆకలి తీర్చే ఆహారాన్ని ఇవ్వమని కోరుతూ చేసే ఈ మంత్రం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి, నీరు, పోషక సమతుల్యతలను నిర్వహించే సంకేత వ్యవస్థ ఆవిష్కృతమవుతుంది. సూక్తంలోని ప్రతీ మంత్రం ఆధునిక వ్యవస్థలోని అంశాలకు సంబంధాన్ని కలిగి ఉండటం విశేషంగా చెప్పాలి. 2025లో ప్రచురితమైన ఒక శాస్త్రీయ అధ్యయనంలో మంత్రోచ్చారణ, జపానికి సంబంధించి 24 న్యూరో ఇమేజింగ్ పరిశోధనలను పరిశీలించారు. వీటివల్ల మెదడులో సానుకూల ప్రకంపనలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ఈ సూక్తంలోని మంత్రాలపై న్యూరోలాజికల్ పరిశోధన కొనసాగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తమ పరిశోధనాపత్రాల్లో తెలిపారు. అటు ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా ఎన్నో అనుభూతులు కలిగిన శ్రావణంలో అదే భావనలు కలిగిన శ్రీ సూక్తం పారాయణం విశేషం. మనకు భావదారిద్య్రం కలగకుండేలా చూస్తూ, ప్రకృతితో మమేకమైన సకల రూప సంపదలను అనుగ్రహించమని శ్రీలక్ష్మిని కోరుకుందాం.
-రంగనాథ్ మిద్దెల 9866573461