కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. నగరవాసులు ట్రాఫిక్ నరకాన్ని చూస్తున్నారు. ఒక్కో జంక్షన్ దాటాలంటే.. 5 నుంచి 9 నిమిషాలు పడుతుందంటే.. పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్‌లోనే చిక్కుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో వాహనాల వేగం గంటకు 26 ఉంటే.. ఇప్పుడది 15కు పడిపోయింది. నగరంలో వాహనాల వేగం గణనీయంగా పడిపోవడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. ప్రపంచంలోనే మెగా స్లో నగరాల టాప్ 10 స్థానంలోకి హైదరాబాద్ చేరిపోవడం ‘ట్రాఫిక్ టెర్రర్’కు అద్దం పడుతున్నది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ ఏ స్థాయిలో ఉందో..అందులో ప్రయాణించే వాహనదారులు తమ విలువైన సమయాన్ని ఎలా కోల్పోతున్నారో నెదర్లాండ్స్‌కు చెందిన టామ్ టామ్ అనే లొకేషన్ అండ్ నావిగేషన్ టెక్నాలజీ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. నగరంలో ప్రతి వాహనదారుడు సంవత్సరానికి ఐదు రోజులకు పైగా ట్రాఫిక్ జామ్‌లో గడుపుతున్నట్లు లెక్కగట్టింది. ఇదిలా ఉంటే బెంగళూరులో వాహనాల స్పీడు గంటకు 13కి.మీలు ఉంటే.. హైదరాబాద్‌లోనూ అలాంటి స్థితి ఏర్పడుతుండటం ప్రజలను కంగారు పెట్టించే విషయమే. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టిపెట్టకుండా.. చలాన్ల వసూళ్లపైనే పోలీసులు దృష్టి పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసిన ట్రాఫిక్ రద్దీ.. కానీ రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు కన్పించరు.. ట్రాఫిక్ నియంత్రణను వదిలేసి కేవలం ఉల్లంఘనలు ఫొటోలు తీయడం… చలాన్ల వసూళ్లే తమ బాధ్యత ఉన్నట్లుగా నేడు ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసులు వ్యవహరిస్తున్నారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌లోనే వాహనదారులు చిక్కుకుంటున్నారు.. జంక్షన్లన్నీ ట్రాఫిక్‌తో జామ్ అవుతున్నాయి, ఒక్కో జంక్షన్ దాటాలంటే కనీసం 5 నుంచి 9 నిమిషాల వ్యవధి పడుతుంది. హోంమంత్రిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా చలాన్ల వసూళ్లకే ప్రాధాన్యత అన్నట్లుగా పబ్లిక్ మీటింగ్‌లలో మాట్లాడుతుండడంతో పోలీసులు సైతం… చలాన్లపైనే దృష్టిపెట్టి.. ట్రాఫిక్ నియంత్రణను పక్కన పెట్టేశారని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారులే కాకుండా ప్రత్యామ్నాయ రూట్లు, కాలనీలలోని రోడ్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయి.. ఎటు నుంచి ప్రయాణించినా గంటల పాటు ట్రాఫిక్‌లోనే చిక్కుకోవాల్సిన దుస్థితి నగర వాసులకు ఏర్పడింది. హైదరాబాద్‌లో వాహనాల వేగం పూర్తిగా పడిపోయి, గ్రేటర్లో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందనే విషయాన్ని చెబుతుంది. ట్రాఫిక్ నిర్వహణపై సర్కార్ దృష్టి పెట్టకపోవడంతో నగర ప్రజలు ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా చితికిపోతున్నారు. ఇంధన కాలుష్యం, రోడ్డు నిర్వాహణ సరిగ్గా లేకపోవడంతో వాహనాలపై గంటల తరబడి కూర్చోవడంతో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు.
ఎక్కువ సేపు వాహనాలపై కూర్చోవడం వల్ల చాలా మంది వాహనదారులు వెన్ను నొప్పి, నడం, మెడ నొప్పి, స్కిన్ అలర్జీ, ఊపిరితిత్తుల సమస్యలకు గురవుతున్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, మందమల్లమ్మ జంక్ష న్, మైలార్‌దేవ్‌పల్లి, అరాంఘర్, హబ్సిగూడ జంక్షన్, సంగీత్ జంక్షన్, జేబీఎస్, బోయిన్పల్లి, అల్వాల్, కొంపల్లి, రసూల్‌పురా జంక్షన్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, అమీర్‌పేట్, కూకట్పల్లి, నిజాంపేట్, జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, షేక్‌పేట్, గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ, నానక్‌రాంగూడ, గచ్చిబౌలి చౌరస్తా, హైటెక్‌సిటీ జంక్షన్ నగరంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్‌తో సతమతం అవుతున్నాయి.

Traffic
పడిపోయిన వేగం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ మహానగర ప్రజలు ట్రాఫిక్‌తో నరకం అనుభవిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో గంటకు 26 కిలోమీటర్ల వేగంతో హైదరాబాద్ దేశంలోని మెట్రో నగరాలతో పాటు ప్రపంచ స్థాయి నగరాలలో మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని నేడు వాహనాల వేగం గంటకు 15 కిలోమీటర్లకు పడిపోయింది. ప్రస్తుతం నగరంలో వాహనాల వేగం ఉదయం, సాధారణ సమయాలలో గంటకు 18 కిలోమీటర్లు ఉండగా, సాయంత్రం రద్దీ సమయాలలో గంటకు 15 కిలోమీటర్లకు పడిపోయినట్లు సర్వేలు తెలుపుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం ప్రపంచంలోని ‘మెగా స్లో నగరాల టాప్ 10’ స్థానంలోకి చేరిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నెదర్లాండ్స్‌కు చెందిన ‘టామ్ టామ్’ అనే లొకేషన్ అండ్ నావిగేషన్ టెక్నాలజీ సంస్థ ఇటీవల హైదరాబాద్‌లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యపై సర్వే వివరాలు వెల్లడిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్రాఫిక్ పెరుగుదలకు అనుగుణంగా ఫై ఓవర్లు, అండర్‌పాసులు నిర్మించడం, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ కలిసి సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ట్రాఫిక్‌పై సమీక్షలు నిర్వహించేవారు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవు.
ట్రాఫిక్‌ను పట్టించుకునే వారే కరువయ్యారు. కేవలం ట్రాఫిక్ చలాన్లు వేయడం, వాహనదారుల నుంచి ముక్కుపిండి వాటిని వసూలు చేయడం, కోర్టులు చెప్పినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా బలవంతంగా వసూలు చేయడంపైనే పోలీసులు దృష్టి పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి నేరుగా చలాన్లు వసూలు చేయాలని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారంటే ఇక ట్రాఫిక్ పోలీసులు ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. బెంగళూర్‌లో వాహనాల వేగం 13 కిలోమీటర్లు ఉండడంతో అక్కడి ప్రజలు నిత్యం ట్రాఫిక్‌లో నరకం అనుభవిస్తున్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌లోను ఏర్పడుతుండడం నగర ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.
చిన్న పనులు చేయలేని అసమర్థత
ప్రతి సంవత్సరం సుమారు 3.5 లక్షల వరకు కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఇప్పటికే మహానగరంలో సుమారు 88 లక్షల వరకు వాహనాలున్నాయి. వీటికి తోడు జిల్లాలు, ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిపోయే వాహనాల సంఖ్య సైతం వేలల్లోనే ఉంటుంది. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేయాలి, కానీ అది అన్నిచోట్ల సాధ్యం కాదు, అందుకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ చర్యలు చేపట్టాలి. బీఆర్ఎస్ హయాంలో ట్రాఫిక్ నియంత్రణకు పలురకాల అభివృద్ధి పనులు చేశారు. ఉప్పల్, ఎల్బీనగర్ చౌరస్తాలో ఫ్లైఓర్లు, అండర్‌పాస్‌లు, స్కైవేలు నిర్మించారు. ఆ చౌరస్తాలలోనే బస్‌స్టాప్‌లు ఉండడం, యూ టర్న్‌లు సరిచేయడం వంటి కనీస చర్యలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేయలేని దుస్థితిలో ఉందని వాహనదారులు విమర్శిస్తున్నారు.
అత్యధిక వాహన సాంద్రత
హైదరాబాద్ మహానగరంలో ఉన్న సుమారు 900 కి.మీ ప్రైమరీ రోడ్డు నెట్ వర్క్‌లో సుమారు 88 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోడ్లపై వెళ్లే వాహనదారులు ఈ ట్రాఫిక్‌లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ఇప్పుడు ప్రధాన రహదారులపై కిలోమీటర్‌కు దాదాపు 9500 వాహనాలు ఉంటున్నాయి. దేశంలోనే అత్యధిక వాహనాల సాంద్రత కలిగిన నగరంలో హైదరాబాద్ ప్రధానమైంది. నగరంలో రోడ్డు నెట్వర్క్ పెద్దగా మారకపోవడం, వచ్చే వాహనాల సంఖ్య ప్రతియేడు లక్షల్లో పెరగడంతో రానూరాను ఈ సమస్య జఠిలంగా మారుతోంది. ప్రతియేడు వస్తున్న కొత్త వాహనాల పార్కింగ్ కోసం 200 ఎకరాల స్థలం అవసరముంటుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
ట్రాఫిక్‌లోనే నగర జీవి..
హైదరాబాద్‌లో నెలకొన్న ట్రాఫిక్‌పై నెదర్లాండ్స్‌కు చెందిన ‘టామ్ టామ్’ అనే లొకేషన్ అండ్ నావిగేషన్ టెక్నాలజీ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో ట్రాఫిక్ రద్దీ ఏ స్థాయిలో ఉందో, అందులో ప్రయాణించే వాహనదారులు తమ విలువైన సమయాన్ని ఎలా కోల్పోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లోని ప్రతి వాహనదారుడు సంవత్సరానికి ఐదు రోజులకుపైగా ట్రాఫిక్జామ్లోనే గడుపుతున్నాడు. ఇది నగరంలో నెలకొన్న రోడ్ల దుస్థితి, ట్రాఫిక్ రద్దీ తదితర సమస్యలకు అద్దం పడుతుందని చెప్పవచ్చు.
నగరంలో ప్రయాణీకులు ప్రతి యేటా 123 గంటల పాటు ట్రాఫిక్‌లో గడుపుతున్నారని, 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు దాదాపు సుమారు 40 నిమిషాల ప్రయాణ సమయం పడుతుందని ఆయా సర్వేల ద్వారా తెలుస్తోంది. రద్దీ సమయాల్లో వాహనాల వేగం గంటకు 15.2 కిలోమీటర్లకు తగ్గినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మెట్రోనగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో వాహనాల రద్దీతో వెలువడుతున్న కాలుష్యం కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తూ హైదరాబాద్ వాసుల మొత్తం జీవన నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ మహానగరం న్యూయార్క్, లండన్, టోక్య వంటి గ్లోబల్ మెట్రో నగరాలను అధిగమించి టాప్ 10 ‘మెగా స్లో’ నగరాలలో చేరడంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.