మొయినాబాద్, జూన్ 3 : ఫ్యూచర్ సిటీ కోసం భూముల సేకరణ.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు రైతుల భూముల్లో సర్వే.. పచ్చని గిరిజన రైతుల భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు.. తాజా గా గోశాల ఏర్పాటుకు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూముల్లో ప్రభుత్వ బోర్డుల ఏర్పాటు! ఇలా నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకచోట రైతులు రోడ్డున పడుతూనే ఉ న్నారు. అవసరం ఏదైనా సరే! రేవంత్ సర్కా రు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములపై పంజా విసురుతున్నది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లి పరిధిలోని 99.14 ఎకరాల సాగు భూములను ప్రభుత్వం గోశాల ఏర్పాటుకు స్వాధీనం చేసుకుంటున్నది. దాదాపు ఏడు దశాబ్దాలుగా నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్న ఆ భూములు ప్రభుత్వానివంటూ ఆరు నెలల క్రితమే అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఆందోళనకు గురైన రైతులు స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆశ్రయించారు. సీఎంతో మాట్లాడుతానంటూ హామీ ఇవ్వడంతో రైతులు ఊరట దొరికిందని అనుకున్నారు. కానీ మంగళవారం రెవెన్యూ అధికారులే కాకుండా ఏకంగా కలెక్టర్ కూడా వచ్చి ‘మీ భూములు తీసుకుంటున్నాం’ అని చెప్పడంతో రైతుల నెత్తిన పిడుగు పడినంత పనైంది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లి రెవెన్యూలో ఉన్న 180 సర్వే నంబర్లో 99.14 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూములను గ్రామానికే చెందిన 50 మంది ఎస్సీ, బీసీ నిరుపేదలు 70 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. మరికొంత మందికి 1954లో అప్పటి ఇచ్చింది. వారి వద్ద ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన తోక పాస్ పుస్తకాలు, శిస్తు కట్టిన రశీదులు కూడా ఉన్నాయి. 1983 వరకు రైతులు భూమిశిస్తూ చెల్లించారు. అయినా ప్రభుత్వ భూమి అని రికార్డుల్లో నమోదవుతూ వస్తున్నది. రైతులు కూడా తామే కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్నందున ఎలాంటి ఢోకా ఉండదని భావించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ భూములు వారికి దక్కకుండా చేసేందుకు రంగం సిద్ధమైంది.
జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డితోపాటు హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజు, చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ ఏకంగా ఆ భూములను పరిశీలించడానికి మంగళవారం సాయంత్రం వచ్చారు. అధికారులు ఆ భూములను పరిశీలించడానికి వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న రైతులు భూముల వద్దకు చేరుకున్నారు. తమ భూములను ఇవ్వబోమని చెప్పడంతో రైతులు, అధికారుల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకున్నది. ఎట్టి పరిస్థితిల్లో తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేదిలేదని వారు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లేకుంటే భూమికి భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. తాము సచ్చినా భూములను మాత్రం ఇవ్వబోమని, ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని రైతుల డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ భూములను గోశాలకు కేటాయించడం జరిగిందని, ఖాళీ చేయాల్సిందేనని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టంచేయడం గమనార్హం. బుధవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆ భూముల రైతులు వచ్చి తమ డిమాండ్లను చేవెళ్ల ఆర్డీవోకు చెప్పుకోవాలని అధికారులు సూచించారు.
మొయినాబాద్ మండలం ఎనికెపల్లిలో గోశాల ఏర్పాటు వెనుక మర్మమేమిటనే విషయాలపై వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి. గండిపేట పరిధిలో ఇప్పటికే ఒక గోశాల ఉన్నది. శ్రీకృష్ణ గోసేవా సమితి దీనిని నిర్వహిస్తున్నది. వీరికి చెందిన 150 ఎకరాలతోపాటు ప్రభుత్వానికి చెందిన 200 ఎకరాలు వీరి ఆధీనంలోనే ఉన్నది. అందుకే దీనిని ఎనికెపల్లికి తరలించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. దీంతో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్కారు స్వాధీనం చేసుకోనున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం గోశాల కొనసాగుతున్న భూమి మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో (ప్రైం ఏరియా) ఉన్నది. అందుకే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలోనే ఎనికెపల్లి వద్ద రైతుల నుంచి భూమిని తీసుకుంటున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాత, ముత్తాతలు నుంచి ఆ భూములే మాకు ఆధారం. ఆ భూములను సర్కారు గుంజుకుంటే కిరోసిన్ పోసుకొని చస్తాం. అందరం పేదోళ్లమే. మాకు వేరేచోట పట్టా భూములు లేవు. చెట్లపొదలను గుట్టలను రాళ్లను తొలగించి భూములను చదును చేసుకున్నం. ఆ భూములనే సాగుచేసుకొని దశాబ్దాలుగా బతుకుతున్నాం. కాంగ్రెస్ పుట్టినప్పటినుంచి కాంగ్రెస్‌కే ఓటేస్తూ వస్తున్నం. పట్టాలు వస్తాయేమోనని ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నం.
ప్రభుత్వం మా భూములను బలవంతంగా గుంజుకుంటే మా శవాల మీదే గోశాలను నిర్మించాలి. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు భూములిస్తే.. నేటి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదలు సాగు చేసుకుంటున్న భూములను గుంజుకుంటున్నది. 70 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను గోశాలకు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాటి ప్రభుత్వం ప్రతి పేదవాడికి రెండెకరాల భూమిని కేటాయించింది. ప్రభుత్వం ఇప్పటికైనా పునారాలోచన చేయాలి.
Also Read : ఎర్రగడ్డ దవాఖానలో ఫుడ్‌పాయిజన్.. 70 మందికి అస్వస్థత