Pak attack : ఉగ్రవాదులే లక్ష్యమని చెప్పి అఫ్గానిస్థాన్ (Afghanistan) పై పాకిస్థాన్ (Pakistan) దాడులకు పాల్పడింది. పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లోని నివాస ప్రాంతాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలువురు అఫ్గాన్ పౌరులు మృతిచెందారు. ఇటీవల తమ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు నిర్వహించినట్లు పాకిస్థాన్ పేర్కొన్నది. నంగర్హార్, పాక్టికా ప్రావిన్స్‌లలో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ దాడులు జరిగాయి.
తమ పౌరుల నివాసాలపై పాకిస్థాన్ బాంబులతో దాడి చేసిందని, ఈ ఘటనలో డజన్ల కొద్దీ చనిపోయారని అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ చెప్పారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఈ దాడి ఘటనను పాకిస్తాన్ ధ్రువీకరించింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఏడు టెర్రరిస్ట్ క్యాంపులపై దాడులు చేపట్టినట్లు ఆ దేశ సమాచారశాఖ మంత్రి తరూర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
పాకిస్థానీ తాలిబాన్, దాని అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు.
అంతేకాకుండా ఐసిస్ అనుబంధ గ్రూప్‌పై సైతం దాడి చేసినట్లు తరూర్ పేర్కొన్నారు. ఇటీవల ఇస్లామాబాద్‌లో మసీద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిని తామే చేసినట్లు ఐసిస్ ప్రకటించుకుంది. ఈ ఘటనలో 31 మంది పాక్ పౌరులు మృతి చెందగా, 161 మంది గాయపడ్డారు.