నల్లగొండ: మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Rajagopal Reddy) సొంతపార్టీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ను కాపాడేందుకు తన ఆస్తులు అమ్ముకున్నానని, కానీ పార్టీ తనను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని, తనతోపాటు బీజేపీ నుంచి వచ్చిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి, అతని కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. తనను మాత్రం పక్కన పెట్టారని మండిపడ్డారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని కష్టపడిన నన్ను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చి తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని చెప్పారు.
ఎక్సైజ్ నిబంధనలకు తోడు నియోజకవర్గ ఎమ్మెల్యే సొంత నిబంధనలు ఖరారు చేయడం మునుగోడు నియోజకవర్గంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిబంధనల పేరుతో జారీ చేసిన అంశాలపై సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్, సంస్థన్ నారాయణపురం మండలాలలో వైన్ షాప్స్ టెండర్స్ వేసే ఆశావహులు టెండర్లు వేయాలంటే షరతులు పాటించాలని హుకుం జారీ చేశారు. షరతులు పాటించని వారు టెండర్స్ వేయవద్దని,వైన్ షాప్స్ నిర్వాహకులు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని సూచించారు .
మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలానికి చెందిన వ్యక్తులు టెండర్లు వేయవద్దని స్పష్టం చేశారు. వైన్ షాప్లు ఊరి బయట మాత్రమే పెట్టాలని,వైన్ షాప్ కు అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండవద్దన్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దని , లాటరీ విధానంలో వైన్స్ షాప్ లు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదని పేర్కొన్నారు.ఈ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాప్ల నిర్మూలన, మహిళల సాధికారతే తన ఉద్దేశమని పేర్కొన్నారు.