హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఈ రోజు మంత్రి సురేఖకు జరిగింది, రేపు తమకు జరగదని గ్యారెంటీ ఏంటని, కాబట్టి అందరం సమష్టిగా ఉండి ముఖ్యమంత్రిని నిలదీద్దామని మంత్రులు (Telangana Ministers) ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లడం, వారిని సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు అండగా ఉండాలని కొందరు మంత్రులు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మినహా దాదాపు మిగిలిన మంత్రులందరూ గురువారం ఉదయం సురేఖకు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిసింది. మంత్రి ఇంటిపైకి పోలీసులను పంపడం సంప్రదాయం కాదని అన్నట్టు తెలిసింది. తాము అండగా ఉంటామని, బీసీ మంత్రిపై కక్ష కట్టినట్టు వ్యవహరించడం సరికాదని చెప్పినట్టు సమాచారం. ఓఎస్డీ తొలగింపుపై సమాచారం ఇవ్వకపోవడం, తొలగించిన ఆయనను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తామనడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని మంత్రులు అన్నట్టు తెలిసింది. ఇప్పుడు దీనిని పట్టించుకోకుంటే ఇది మరింత పెద్దది అవుతుందని, మిగిలి మంత్రులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పినట్టు సమాచారం. మంత్రులను ముఖ్యమంత్రే గౌరవించకుండా ఇంటి మీదకు పోలీసులను పంపడం వల్ల కార్యకర్తలు, ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయని అన్నట్టు తెలిసింది.
సుమంత్ తమతో దశాబ్దాలుగా ఉన్నారని, తమకు ఇంటి మనిషి లాంటి వ్యక్తి అని తెలిసి కూడా తమకు ఒక్క మాట కూడా చెప్పకుండా తొలగించారని, టాస్క్‌ఫోర్స్ పోలీసులను అర్ధరాత్రి ఇంటిపైకి పంపించారని మంత్రి కొండా సురేఖ సహచర మంత్రులతో వాపోయినట్టు తెలిసింది. తాను మంత్రినని ప్రభుత్వమే గౌరవించనప్పుడు తాను పదవిలో ఉన్నా, లేకపోయినా ఒకటేనని అన్నట్టు సమాచారం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులకు మంత్రివర్గంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని వాపోయినట్టు తెలిసింది.
కీలక మంత్రి ఒకరు కొండా సురేఖతో మాట్లాడుతూ సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి పేషీలోనే వసూల్ రాజాలున్నారని, సీఎం ప్రధాన అనుచరుడిగా ఉన్న ఉదయ్‌సింహాపై అనేక ఆరోపణలున్నాయని, సీఎం పేరు చెప్పి ఆయన అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని చెప్పినట్టు తెలిసింది. సీఎం చుట్టూ ఉన్న ఫహీంఖురేషీ, రోహిన్‌రెడ్డి, ఏవీరెడ్డి, అజిత్‌రెడ్డి ఇలా అనేకమందిపై అరోపణలు వచ్చినా పట్టించుకోవడం లేదని, కానీ కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న వ్యక్తిని తొలగించి, కేసులు పెట్టి వేధించాలనుకోవడం సరికాదని చెప్పినట్టు సమాచారం.