Nagarjuna 100 Movie | టాలీవుడ్ సూపర్‌స్టార్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన సినీ కెరీర్లో కీలక మైలురాయిగా నిలిచే 100వ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 99 సినిమాల్లో నటించిన నాగార్జునకు ఈ చిత్రం ప్రత్యేకం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆయన కెరీర్లో ల్యాండ్‌మార్క్ మూవీగా నిలవనుందని విశ్లేషకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారం, ఈ సినిమాకు “లాటరీ కింగ్” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. మూవీ కథ రాజకీయ నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయబోతున్నారట.ఒక పాత్రలో సాధారణ వ్యక్తిగా, మరొకటి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడట.
అంతేకాదు చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో మరో స్టార్ హీరో క్యామియో ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. హీరోయిన్ల విషయంలోనూ అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. మొదట సీనియర్ నటి టబు నటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె తప్పుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత లేడీ సూపర్‌స్టార్ నయనతార ను తీసుకోవాలని మేకర్స్ పరిగణించినట్లు వార్తలొచ్చాయి. అయితే, చివరికి అనుష్క శెట్టి కీలక పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ‘బాస్’ చిత్రంలో నాగార్జున – అనుష్క కెమిస్ట్రీ మంచి గుర్తింపు పొందింది, కాబట్టి ఈ జోడీ ఫ్యాన్స్ కోసం ఎగ్జైటింగ్ గా ఉంటుంది.
నాగార్జున – అనుష్క కాంబినేషన్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరు కలిసి నటించిన డాన్, రగడ, ఢమరుకం, ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనా వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలోనే నాగార్జున 100వ చిత్రంలో అనుష్కను తీసుకున్నారనే వార్తలతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియాలో “నాగార్జున – అనుష్క కాంబోతో హిట్ గ్యారంటీ” అనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్ వివరాలు, ఇతర నటీనటుల జాబితా త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అనుష్క శెట్టి ఇటీవల క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘ఘాటీ’ సినిమా చేసింది, అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ నాగ్ 100వ చిత్రంలో ఆమె పర్ఫార్మెన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.