మామిళ్లగూడెం, ఫిబ్రవరి 26: ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నంబర్లలో భూదాన్ భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు చట్టబద్ధమైనవేనని కలెక్టర్ అనుదీప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 31 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి ఆక్రమణలో ఉందని, ఈ భూమి విలువ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు.
భూదాన్ బోర్డు భూమిని సీసీఎల్ఏ, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకోవడం ద్వారా భారీస్థాయిలో ఆస్తిని రక్షించగలిగామని చెప్పారు. ఈ నెల 24న నిర్వహించిన కూల్చివేతలపై హైకోర్టులో కొందరు లంచ్ మోషన్ను పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని తిరస్కరించినట్టు తెలిపారు. భూదాన్ బోర్డు, రెవెన్యూశాఖ సమగ్ర విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు వెలుగు చూశాయని వెల్లడించారు.