సూర్యాపేట/కోదాడ, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ) : కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్ హత్యకు ముమ్మాటికీ రాజకీయ ఒత్తిళ్లే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేను అభాసుపాలు చేసేందుకు పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లే హత్య జరిగిందని ఆరోపించారు. ఇప్పటికే కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారని.. పూర్తి న్యాయం జరిగేవరకూ ప్రభుత్వాన్ని వదిలేది లేదంటూ హెచ్చరించారు.
రాజేశ్ హత్యోదంతంపై అసెంబ్లీ, శాసనమండలిలో నిలదీస్తామని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్తామని స్పష్టంచేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఇటీవల కర్ల రాజేశ్ హత్యకు గురి కాగా, ఆయన కుటుంబాన్ని గురువారం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలసి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటన వివరాలను రాజేశ్ తల్లి లలితమ్మను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కోదాడలో 4 నెలలైనా ప్రభుత్వం రాజేశ్ కుటుంబానికి న్యాయం చేయలేదని, దీనికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డే కారణమని కేటీఆర్ ఆరోపించారు.
డీఎస్పీ, సీఐ, ఎస్సైలను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. గత బీఆర్ఎస్ హయాంలో తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరులో మరియమ్మ అనే దళిత మహిళ పోలీస్‌స్టేషన్‌లో మరణిస్తే అప్పటి సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ముగ్గురు పోలీసు అధికారులను డిస్మిస్ చేశారని గుర్తుచేశారు. కేవలం నెల రోజుల వ్యవధిలో బాధిత కుటుంబానికి రూ.35 లక్షల సాయంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇచ్చారని చెప్పారు. ఆయన వెంట ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు ఉన్నారు.