జహీరాబాద్, అక్టోబర్ 17: అసలే చలికాలం.. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ వాతావరణం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలే కాదు.. వాహన ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. చలికాలంలో తరచుగా పొగ మంచు (Dense Fog) కారణంగానే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో వాహన చోదకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో తెల్లవారుజామున ఎటుచూసినా పొగమంచే కనిపిస్తోంది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల పొగమంచు కురిసే వేళ తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు. కార్లు, ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు సాధ్యమైనంత వరకు అర్ధరాత్రి, తెల్లవారుజాము ప్రయాణాలు మానేయడం మంచిది.
మంచు పడుతున్నప్పుడు ఫాగ్‌లైట్స్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
కొన్ని సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించవు. అలాంటప్పుడు అతివేగంతో వాహనం అసలు నడపకూడదు. ఒక్కోసారి రోడ్డుపై పడిన మంచుతో వాహనం జారిపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పరిమిత వేగంలో వాహనాలు నడపాలి. సాధారణంగా బ్రేక్ వేస్తే కనీసం 50 అడుగుల దూరంలో వాహనం ఆగుతుంది. అతి వేగంగా ఉన్నప్పుడు 90 అడుగుల దూరంలో నిలుస్తాయి. అంటే సడన్‌గా బ్రేకులు వేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి సాధారణ వేగంలో వాహనాలు నడిపితేనే నియంత్రణ సాధ్యమవుతుంది. ఈ కాలంలో వాహన సామర్థ్యం సరిగా ఉండేలా చూసుకోవాలి. ‘వైపర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? బ్రేకులు సమస్యల్లేకుండా ఉన్నాయా లేదా’ అని చెక్ చేసుకోవాలి? కారులో వెళ్లేటప్పుడు హీటర్ ఉపయోగించాలి. దీనివల్ల ముందు అద్దాలు ఆవిరిపట్టకుండా ఎదుటి వాహనాలను సరిగ్గా గమనించేందుకు వీలు ఉంటుంది.
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఓవర్టేక్ చేయవద్దు. పొగమంచులో దూరాన్ని నిర్ధారించడం కష్టం. కాబట్టి ఓవర్టేక్ చేయడం ప్రమాదకరం. ముందున్న ఇతర వాహనాల డ్రైవర్లు పరధ్యానంలో ఉంటే ఢీకొనే అవకాశాలు పెరుగుతాయి. మంచు కురుస్తున్న సమయంలో ‘లో బీమ్ హెడ్‌లైట్స్’ను ఉపయోగించాలి. హై బీమ్ హెడ్‌లైట్స్ ఆన్ చేస్తే మంచు తుంపర్లు రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ కారణంగా ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి మంచు కురిసే సమయంలో టేల్ లైట్, బ్లింకర్స్‌ను ఉపయోగించడం వల్ల ఎదురుగా వస్తున్న వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగదు. వాహనాలను డ్రైవింగ్ చేసే సమయంలో స్మార్ట్ ఫోన్ వినియోగం, ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వినడం లాంటివి చేయకూడదు. వీటివల్ల బయటి శబ్ధాలు వినిపించవు. కాబట్టి విండోను కాస్తయినా డౌన్ చేయాలి. దీనివల్ల బయట వాహనాల శబ్ధాలు వినిస్తాయి.
డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఎదురుగా ఉండే వాహనాల మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అవతలి వ్యక్తులు సడెన్ బ్రేక్‌లు వేస్తే, వాహనం కంట్రోల్ కావాలంటే కచ్చితంగా గ్యాప్ ఉండాలి. వాహనాల మధ్య గ్యాప్ ఉండకపోతే.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వాహనాలకు లైట్ ఇండికేటర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. రోడ్డు లైన్ మారుతున్న సమయంలో లేదా మలుపులు ఉన్న చోట ఇండికేటర్స్ వేయడం ద్వారా ఇతర వాహనదారులను అలర్ట్ చేయొచ్చు. దీనివల్ల అనుకోకుండా జరిగే ప్రమాదాలను తగ్గించవచ్చు. మంచు కురుస్తున్న సమయంలో మీ వాహనాలను రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయకూడదు. ఒకవేళ రోడ్డు పక్కన పార్కింగ్ చేయాల్సి వస్తే ఇండికేటర్స్‌ను ఆన్ చేయాలి. రోడ్ బే, పెట్రోల్ బంకుల వద్ద ఆగడం మంచిది.