వరంగల్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ టార్గెట్ అయ్యారా? ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది. రేవంత్‌రెడ్డి బుధవారం పరామర్శ పేరుతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ హాజరైనా మంత్రి కొండా సురేఖ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనుల్లో ఆమె ప్రమేయం లేకుండా ఇన్చార్జి మంత్రి పేరుతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తుండటం మంత్రి సురేఖకు కంటగింపుగా మారింది. దీనికి తోడు మేడారం టెండర్ల లీకు వ్యవహారంలో సురేఖ ఓఎస్డీ సుమంత్ పాత్ర ఉన్నదనే అనుమానంతో ప్రభుత్వం ఆయనను ఆ పోస్టు నుంచి తొలగించింది. సుమంత్ కొండా సురేఖ నివాసంలోనే ఉన్నారన్న సమాచారంతో బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లారు. ఈ పరిణామాలన్నింటి వెనుక సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారని కొండా సురేఖ కుమార్తె సుస్మితాపటేల్ ఆరోపించారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యల నుంచి ఆమె ఓఎస్డీ తొలగింపు వరకు చోటుచేసుకుంటున్న పరిణామాలు సంచలనంగా మారాయి. అయితే, ప్రతి ఘటనను తనకు అనుకూలంగా మలచుకున్న కొండా సురేఖ ఈసారి మాత్రం తమను ‘రెడ్డి’ సామాజికవర్గం టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు.
తమది కాంగ్రెస్ రక్తమని చెప్పుకుంటున్న కొండా సురేఖ మధ్యలో కొన్ని సంవత్సరాలు మాత్రం బీఆర్ఎస్లో కొనసాగారు. ఈ క్రమంలో టీడీపీలో పనిచేసి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు తమను టార్గెట్ చేశారని కొండా సురేఖ ఆరోపిస్తున్నారు.వీరికి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్ని విధాలా సహకరిస్తున్నారని గాంధీభవన్ వేదికగా ఆరోపించారు. ఇదే విషయమై అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ప్రస్తుత ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ వరకు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే వరకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. మరోవైపు, కొండా సురేఖ, మురళీధర్‌రావుకు వ్యతిరేకంగా కూడా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. దీంతో వరంగల్ కాంగ్రెస్‌లో రాజకీయ కుంపటి రగులుతూనే ఉంది. ఈ క్రమంలోనే వరుసగా జరుగుతున్న పరిణామాలు మరింత కాక పుట్టిస్తున్నాయి. తాజా పరిణామాల వెనక ఉన్నది సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డేనని కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపించారు.
నిత్యం వార్తల్లో ఉండటం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తమది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పరిచయాలు ఉండడం, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేరుపెట్టి పిలిచే నాయకురాలిగా పేరు తెచ్చుకోవడంతోపాటు, చెప్పినట్టు వినరనే కారణంతో కొండా దంపతులను రేవంత్‌రెడ్డి టార్గెట్ చేశారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. నిజానికి నాగార్జున అంశంలోనే సురేఖపై వేటు తప్పదన్న వార్తలు వినిపించాయి. అప్పట్లో ఆమెను తప్పించాల్సిందేనని వైరి వర్గం అధిష్ఠానానికి ఫిర్యాదు కూడా చేసింది. ఈ ఫిర్యాదుల వెనక కూడా రెడ్డి సామాజికవర్గమే ఉన్నదని, రేవంత్‌రెడ్డి అండ చూసుకుని తమను వేధిస్తున్నారని అప్పట్లో కొండా దంపతులు ఆరోపించారు.