మనలో చాలామంది ఉదయం నిద్రలేవగానే చాయ్ తాగితేగాని ఆ రోజును మొదలుపెట్టరు. రోజుకు మూడు నాలుగు సార్లు టీ తాగేవారూ ఉన్నారు. ఇక చలికాలం వచ్చిందంటే ఈ లెక్క పెరుగుతుందే కానీ, తగ్గదు. ఇంట్లో పెద్దలు అస్తమానం టీ తాగుతుంటే పిల్లలు తమకూ ఇవ్వమని పట్టుబడుతుంటారు. దీంతో చిన్నారులకు సైతం టీ తాగిస్తుంటారు. కానీ, చిన్నారులకు చాయ్ హాని చేస్తుంది. టీలో ఉండే టానిన్లు ఐరన్ లోపానికి దారి తీస్తాయి. అప్పటికే పప్పుధాన్యాలు, కూరగాయలు, పాలకూర తినడానికి మొండికేసే చిన్నారులు టీ తాగడం వల్ల ఐరన్ లోపంతో బలహీనపడుతారు. ఐరన్ లోపం కేవలం రక్తహీనతకు మాత్రమే పరిమితం కాకుండా పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
మరోవైపు మానసికంగా ఇబ్బందిపడుతూ కొన్నిసార్లు మట్టి, గోడల సున్నాన్ని తింటుంటారు. ఈ పరిస్థితినే పికా ఈటింగ్ డిజార్డర్ అని కూడా అంటారు. క్రమంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడతారు కూడా. పిల్లలకు టీ ఇవ్వడం వల్ల అందులోని కెఫిన్ వారి నిద్రకు భంగం కలిగిస్తుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం పిల్లలకు 12 సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకు టీ ఇవ్వకూడదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 12 సంవత్సరాల తర్వాత కూడా అప్పుడప్పుడు మాత్రమే చాలా తకువ పరిమాణంలో ఇవ్వాలని గుర్తు పెట్టుకోండి.