స్వచ్ఛత, అమాయకత్వం కలబోసిన ప్రేమకథ ‘మోగ్లీ’ అని చిత్ర హీరో రోషన్ కనకాల అన్నారు. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్‌రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం రోషన్ కనకాల విలేకరులతో సినిమా సంగతుల్ని పంచుకున్నారు. థియేటర్లో అడుగుపెట్టిన ప్రేక్షకులు ఒక్క క్షణం కూడా బోర్‌గా ఫీలవ్వరని, అంతటి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమాను డిజైన్ చేశారని తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ‘ప్రేమకోసం ఎంత దూరమైన వెళ్లి, ఎంతటి సాహసానికైనా సిద్ధపడే యువకుడి కథ ఇది. అడవి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అక్కడే 60 శాతం షూటింగ్ చేశాం’ అని రోషన్ చెప్పారు. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరగడంతో సినిమా అంటే ప్రేమ పెరిగిందని, తన కథల విషయంలో అమ్మానాన్నలతో చర్చించి వారి సలహాలు కూడా తీసుకుంటానని రోషన్ పేర్కొన్నారు. ఇటీవలే వేసిన సెలబ్రిటీ ప్రీమియర్ షోలో సినిమాకు ప్రశంసలు లభించాయన్నారు.